● పంజా విసురుతున్న సెల్యులైటిస్ ● ఉమ్మడి కరీంనగర్‌లో రోగుల ఉక్కిరిబిక్కిరి ● మూడేళ్లుగా తీవ్రమవుతున్న ముప్పు
కరీంనగర్: ఒకప్పుడు అరుదుగా కనిపించిన సెల్యులైటిస్ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆందోళనకరస్థాయికి చేరుకుంది. మూడేళ్లుగా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాదిలో మరింత వేగంగా కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. జనరల్ సర్జరీ విభాగం ఉన్న ఆస్పత్రుల్లో సెల్యులైటిస్ బాధితులు చికిత్స పొందుతుండడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. కొందరు మందులతో కోలుకుంటుండగా, మరికొందరికి చీము పేరుకుపోవడంతో శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తోంది. మధుమేహం, రక్తప్రసరణ లోపాలు, పాదాల పగుళ్లు, చిన్న గాయాలను నిర్లక్ష్యం చేయడం, పరిశుభ్రత లోపించడం వంటి కారణాలతో ఈ వ్యాధి ఎక్కువగా విజంభిస్తోందని వైద్యలు చెబుతున్నారు. తొలిదశలో చర్మ సమస్యగా కనిపించే ఈ ఇన్ఫెక్షన్‌ను చాలామంది నిర్లక్ష్యం చేయడంతో తీవ్రస్థాయికి చేరుకుని శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితులు పెరుగుతున్నాయి.
ఈ లక్షణాలు ప్రమాదకరం...
సెల్యులైటిస్ అనేది చర్మంతో పాటు చర్మం కింద ఉన్న మదుకణజాలంలో ఏర్పడే తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ప్రారంభ దశలోనే చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చర్మం ఎర్రగా మారడం, వాపు వేగంగా పెరగడం, భరించలేని నొప్పి, ప్రభావిత భాగం వేడిగా అనిపించడం, జ్వరం, వణుకు, చర్మం బిగుసుకుపోవడం, చీము ఏర్పడటం, నడవడంలో ఇబ్బంది, ఈ లక్షణాలతో పాటు మధుమేహం కూడా ఉంటే వెంటనే శస్త్రచికిత్స నిపుణుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
నిర్లక్ష్యం చేస్తే...
సెల్యులైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ లోతైన కణజాలానికి వ్యాపించి నెక్రోటైజింగ్ సాఫ్ట్ టిష్యూ ఇన్ఫెక్షన్, సెప్సిస్, గ్యాంగ్రీన్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు. కొందరిలో చీము పేరుకుపోవడంతో ఇన్సిషన్ అండ్ డ్రైనేజీ శస్త్రచికిత్స అవసరమవుతుంది. దీనిని గుర్తించేందుకు సీ–రియాక్టివ్ ప్రోటీన్, టోటల్ ల్యూకోసైట్ కౌంట్, అల్ట్రాసౌండ్ పరీక్షలు, చీము ఉంటే కల్చర్ పరీక్ష ద్వారా ఏ బ్యాక్టీరియా కారణమో గుర్తిస్తారు. చీము వస్తోందని స్వయంగా నొక్కడం, కోయడం, ఇంటి చిట్కాలతో కాలయాపన చేయడం ప్రమాదకరం. ఇన్‌ఫెక్షన్ పెరిగితే ఒక్కోసారి కాలుకూడా తీసి వేయాల్సి వస్తుంది.


