● ఇంటికి చేరకముందే కబళించిన మృత్యువు ● స్నేహితుడితో కలిసి రోడ్డు దాటుతుండగా ప్రమాదం ● గుర్తు తెలియనివాహనం ఢీకొని కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
జ్యోతినగర్: పెద్దపల్లిలోని తమ బంధువుల ఇంట ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుడు కోండ్ర లింగమూర్తి(42) ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు రాజీవ్ రహదారిపై ఆదివారం అర్ధరాత్ర జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో నివసిస్తున్న కోండ్ర లింగమూర్తి ఎన్టీపీసీలోని సీహెచ్‌పీ విభాగంలో హౌస్‌కీపింగ్ పనులు చేస్తున్నాడు. ఆదివారం పెద్దపల్లిలో తమ బంధువుల ఇంటిలో జరిగిన కార్యక్రమానికి హాజరై రాత్రి శ్రీరాంపూర్ బస్సులో వెళ్తున్నాడు. ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డులోని తన స్నేహితుడు ముల్కల శ్రవణ్‌కుమార్‌ను కలుసుకునేందుకు అక్కడికి రాగానే బస్సు దిగాడు. ఇద్దరూ కలిసి రోడ్డు దాటుతుండగా గోదావరిఖని వైపు నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం అతివేగంతో లింగమూర్తిని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడిని శ్రవణ్‌కుమార్‌తోపాటు గోదావరిఖని గంగానగర్‌కు చెందిన కారుడ్రైవర్ కలవేని అనిల్ వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. మృతుడి సోదరుడు కోండ్ర నర్సయ్య ఫిర్యాదు మేరకు ఏఎస్సై బుచ్చిన్నాయుడు కేసు నమోదు చేశారు. కుటుంబసభ్యుల అంగీకారంతో సదాశయ ఫౌండేష్‌న్ ఆధ్వర్యంలో టెక్నీషియన్ ప్రదీప్ మృతుడి నేత్రాలను సేకరించి హైదరాబాద్‌కు పంపించారు. మృతుడికి భార్య స్వర్ణలత, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్, కార్మికులు సంతాపం తెలిపారు. శ్రీరాంపూర్‌లో జరిగిన అంత్యక్రియలకు హాజరయ్యారు.


