ధర్మపురి: భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. ధర్మపురితో పాటు మండలంలోని నర్సయ్యపల్లె– కొత్త కొరండ్లపల్లె మధ్య దెబ్బతిన్న రోడ్డు, కల్వర్టు, ఆకసాయిపల్లె– నాగారం మధ్య కోతకు గురైన రోడ్డును శుక్రవారం పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో మధుసూదన్, సంబంధిత అధికారులు తదితరులున్నారు.
శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలి
వెల్గటూర్(ధర్మపురి): మండలంలోని స్తంభంపల్లి చెరువుకు శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఇటీవల మండలంలో 175.7 మి.మీర్ల భారీ వర్షం కురవడంతో చెరువులో భారీగా వరద చేరింది. చెరువు తూముకు ఆనుకుని గతంలో ఏర్పడిన సింక్‌హోల్‌లో అప్పడు ఇసుక బస్తాలతో తాత్కాళిక చర్యలు చేపట్టారు. ప్రస్తుత వర్షాలకు బస్తాలు కొట్టుకుపోయి ప్రమాదం జరుగుతుందేమోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేయగా, సింక్‌హోల్ ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. పర్యవేక్షించారు. చెరువు భద్రతకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, శుక్రవారం సాయంత్రం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చెరువుకు వరద పూర్తిగా తగ్గింది. దీంతో చెరువు కట్ట, తూముకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. తహసీల్దార్ శేఖర్, ఎంపీడీవో వెంకట్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


