ఎల్ఆర్ఎస్ అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

ఎల్ఆర్ఎస్ అంతంతే..

Jul 29 2026 12:46 AM | Updated on Jul 29 2026 12:46 AM

● ఈనెల 31తో ముగుస్తున్న గడువు ● 25 శాతం ఫీజురాయితీకి స్పందన కరువు ● గడువు పెంచినా ముందుకురాని ప్రజలు

జగిత్యాల: అక్రమ ప్లాట్లు.. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్‌ఆర్‌ఎస్‌ పథకానికి జిల్లాలో స్పందన కరువైంది. ఈనెల 31లోపు ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఎవరూ పెద్దగా ముందుకు రాలేదు. క్రమబద్ధీకరణకు గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దరఖాస్తులు తీసుకున్నప్పటికీ పరిష్కరించడంలో జాప్యం చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ అవకాశం ఇచ్చింది. ఇప్పటికీ రెండుమూడు సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ ఎల్‌ఆర్‌ఎస్‌కు పెద్దగా స్పందన రావడం లేదు. ఈనెల 31తో గడువు ముగుస్తున్నప్పటికీ జిల్లాలో ఇంకా అనేకం పెండింగ్‌లోనే ఉన్నాయి. దరఖాస్తుదారుల్లో చాలామంది ఇళ్ల నిర్మాణం చేపట్టుకోక ప్లాట్ల క్రయవిక్రయాలు చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యమో.. దరఖాస్తుదారులు పట్టించుకోకపోవడమోగానీ పథకం ఆశించిన తీరులో ముందుకు కదలడం లేదు. కొన్ని దరఖాస్తులు వచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడం, ప్రొసీడింగ్స్‌ జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండడం ఇబ్బందికరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఫీజు అధికంగా ఉండటంతో ప్రజలు ముందుకు రావడం లేదని సమాచారం. ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పించినప్పటికీ పట్టించుకోవడం లేదు. దరఖాస్తుల పరిశీలనలు ఎల్‌–1, ఎల్‌–2, ఎల్‌–3 దశల్లో చేపడుతున్నారు. మూడు దశల్లో ఇరిగేషన్‌, మున్సిపల్‌, రెవెన్యూ శాఖలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అన్ని వివరాలు సక్రమంగా ఉంటేనే అధికారులు ప్రొసీడింగ్‌ జారీ చేస్తారు.

పొడిగింపు ఉండేనా..?

జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ మున్సిపాలిటీలుగా ఉన్నాయి. వీటి పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌కు సుమారు 27,483 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కేవలం 2435 మాత్రమే అప్రూవ్‌ అయ్యాయి. ఈనెల 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ లభిస్తుంది. ఒకవేళ 31 దాటితే మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే రెండు విడతల్లో అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఒకవేళ ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని పొడిగిస్తే అధికారులు పూర్తిస్థాయిలో ప్రచారం చేస్తే తప్ప పథకం ఆశించినస్థాయిలో ముందుకు కదలదు. ఎల్‌ఆర్‌ఎస్‌ పకడ్బందీగా అమలు చేస్తే ఇటు ము న్సిపాలిటీలు, అటు గ్రామపంచాయతీలకు ఫీజుల రూపంలో ఆదాయం లభించే అవకాశం ఉంది.

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల వివరాలు

వచ్చిన దరఖాస్తులు 27,483

అప్రూవ్‌ అయినవి 2,435

రిజెక్ట్‌ చేసినవి 441

పెండింగ్‌ 24,607

గ్రామపంచాయతీలు

వచ్చిన దరఖాస్తులు 11,512

అప్రూవ్‌ అయినవి 990

రిజెక్ట్‌ అయినవి 2

పెండింగ్‌ 10,520

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement