కొడిమ్యాల: ఆభ్యుదయ రైతు, వ్యవసాయ వర్సిటీ సలహా మండలి మాజీ సభ్యుడు కొడిమ్యాల మండలం పూడూరుకు చెందిన వెల్ముల రాంరెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు. రాంరెడ్డి 78 ఏళ్ల వయసులోనూ వ్యవసాయం చేస్తున్నారు. అన్ని పంటలపై వ్యవసాయ విద్యార్థులకు క్షేత్ర స్థాయిలో పాఠాలు భోదిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనల్లోనూ చేదోడు, వాదోడుగా ఉంటున్నారు. రైతులకు సంబంధించి వ్యవసాయ పరిశోధన స్థానం, రైతు వేదికల్లో ఇలా ఎక్కడ.. ఏ కార్యక్రమం జరిగిన పాల్గొని సాగులో తన అనుభవాలు వివరిస్తున్నారు. రైతు సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తూ.. పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. రైతు వేదికలు, రైతునేస్తం ద్వారా ఆయా పంటలపై ప్రభుత్వం ఇప్పటివరకు 100 ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించగా.. పాల్గొన్న ఆయన రైతుల కష్టాలను ఏకరవు పెట్టాడు. వృద్ధాప్యంలోనూ వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తూ.. నేటి యువతరానికి మార్గదర్శకంగా నిలుస్తున్న ఆయనను మంత్రితోపాటు అగ్రివర్సిటీ వైస్ చాన్సలర్ అల్దాస్ జానయ్య, హర్టికల్చర్ వైస్ చాన్సలర్ దండె రాజిరెడ్డి, ఉద్యానశాఖ కమిషనర్ యాస్మిన్ బాషా సన్మానించారు. మండల కేంద్రంలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా ఏవో జ్యోతి ఆరుతడి పంటల సాగుపై రైతులకు వివరించారు. విత్తనమేళా నిర్వహించి కందులు, కూరగాయల విత్తనాలు అందించారు. మండల ఉద్యాన అధికారి మంజూవాణి మాట్లాడుతూ ఆయిల్ పాం , కూరగాయల సాగు చేయాలని కోరారు. ఎఈవోలు శ్రీలత, గ్రీష్మ, హెచ్‌ఈవో అనిల్, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.


