గిరి ప్రదక్షిణం.. స్వామి నామస్మరణం | - | Sakshi
Sakshi News home page

గిరి ప్రదక్షిణం.. స్వామి నామస్మరణం

Jul 29 2026 12:46 AM | Updated on Jul 29 2026 12:46 AM

గిరి ప్రదక్షిణం.. స్వామి నామస్మరణం

రహదారి నిర్మాణానికి అంచనాలు సిద్ధం

నేడు 43వ గిరి ప్రదక్షిణం

పాల్గొననున్న మంత్రి పొన్నం, ఎమ్మెల్యే సత్యం

మల్యాల: కొండగట్టు గిరి ప్రదక్షిణ.. వందమందితో ప్రారంభించిన కార్యక్రమం.. నేడు పది వేల భక్తులకు మించింది. భక్తులు పాదయాత్ర చేస్తూ.. స్వామివారి నామస్మరణతో ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. బుధవారం నిర్వహించే కొండగట్టు 43వ గిరి ప్రదక్షిణలో రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్‌, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొననున్నారు. ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమి రోజున నిర్వహిస్తున్నారు. 2023లో చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు సురేశ్‌ ఆత్మారాం పౌర్ణమి రోజున దిగువ కొండగట్టులోని ఆంజనేయస్వామి విగ్రహం ఎదుట కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల నుంచి భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు ప్రతి పౌర్ణమికీ తరలివస్తున్నారు. దారికిరువైపులా ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిల రావాల మధ్య ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకెళ్తున్నారు. గిరి ప్రదక్షిణదారిని అభివృద్ధి చేసేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ముందుకొచ్చారు. అటవీ ప్రాంతంలో సుమారు 3.5కిలోమీటర్ల దూరం కొనసాగే ప్రదక్షిణలో భక్తులు సేదతీరేందుకు బెంచీలు, తాగునీటి సౌకర్యం, కంచె ఏర్పాటు చేసేందుకు అంచనాలు రూపొందించారు.

పాల్గొనున్న మంత్రి, ఎమ్మెల్యే

43వ గిరి ప్రదక్షిణ.. వరుణపూజలో మంత్రి పొన్నం, ఎమ్మెల్యే సత్యం పాల్గొనున్నారు. ఉదయం ఆరు గంటలకు దిగువ కొండగట్టులో ప్రారంభమయ్యే ఈ ప్రదక్షిణలో పాల్గొన్న అనంతరం వర్షాలు కురవాలని పూజలు చేయనున్నారు. మంత్రి పొన్నం, వేలాదిమంది భక్తులు తరలిరానుండడంతో ప్రదక్షిణ దారిని ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు. భక్తులు ఇబ్బంది పడకుండా రహదారిని జేసీబీతో చదును చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement