జగిత్యాలటౌన్: ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి సీఎంకు లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని, అనంతరం ఏటా లక్ష ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ మూడేళ్లు గడుస్తున్నా అమలు చేయడంలో విఫలమైందన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రాధాన్యతాక్రమంలో క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. రెవెన్యూ శాఖలో తొలగించిన కంప్యూటర్ ఆపరేటర్లను విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం ఒక్కరికీ అమలు చేయలేదని, వెంటనే యువతను ఆదుకోవాలని లేఖలో కోరారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రాయికల్: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి అన్నారు. మంగళవారం రాయికల్ మండలం అల్లీపూర్ రైతు వేదికలో 100 ఎపిసోడ్స్ వరకు హాజరైన బండారి వెంకటేశ్, ఏఈవో రమ్య, పూడూరి రాజేశ్‌ను సన్మానించారు. ఈ సీజన్‌లో వర్షాలు అనుకూలంగా కురవకపోవడంతో రైతులు ప్రభుత్వం ప్రకటించిన పంటలు పండించాలని కోరారు. బబ్బర్లు, కందులు వంటివి సాగు చేయడం ద్వారా అధిక లాభం వస్తుందన్నారు. సర్పంచ్ ఎంబారి గౌతమి, జిల్లా అధికారి భాస్కర్, సింగిల్ విండో చైర్మన్ రాజలింగం, ఏవో ముక్తేశ్వర్, పశువైద్యాధికారి నరేశ్, ఏఈవోలు రమ్య,సౌందర్య, స్రవంతి, నరేశ్, మతయ్య పాల్గొన్నారు.


