జగిత్యాల: ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. ఆగస్టు 3 వరకు గడువు ఉన్నప్పటికీ ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్వోలకు వెంటనే అందించాలని అధికారులకు పేర్కొంటున్నారు. గడువు సమీపిస్తున్న కొద్ది ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 92.84 శాతం పూర్తయింది. ఇంకా 7.16 శాతం పూర్తి కావాల్సి ఉంది. ఈనెల 24తో ముగియనుండగా.. ఓటర్ల నుంచి స్పందన రాకపోవడంతో ఆగస్టు 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. డిజిటలైజేషన్ మాత్రం ముమ్మరంగా చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చకచకగా ముందుకెళ్తున్నారు. దాదాపు అన్ని మండలాల్లో 90 శాతానికి పైగానే పూర్తయింది. ఇప్పటికే రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు ఈ సర్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. మొదట కొంత ఇబ్బందులు పడినప్పటికీ తర్వాత నెమ్మది నెమ్మదిగా పుంజుకుంది. కొన్ని చోట్ల 100 శాతం పూర్తి కావాలన్న ఉద్దేశంతో ఎన్యుమరేషన్ ఫారాలు నింపినా, నింపకున్నా ఇచ్చేశారు. దీంతో పని మళ్లీ మొదటికొచ్చింది. అధికారులు ఇలా అయితే ఓటు ఉండదని, కచ్చితంగా ఫారం నింపి ఇవ్వాలని పేర్కొనడంతో తెలియని వారు తెలిసిన వారి వద్దకు వెళ్లి మరీ నింపి ఇచ్చేందుకు ఆసక్తి చూపారు. అంతేకాక మండలాల్లో అక్కడక్కడ అవగాహన కేంద్రాలను ఏర్పాటు చేసి కొంత మంది నింపి ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. వలస ఓటర్లు సైతం వారి పేర్లు నమోదు చేసుకున్నారు. సుదూర ప్రాంతంలో ఉన్న వారు కొందరు మాత్రం రాకపోవడంతో అక్కడే ఓటరు నమోదు చేసుకున్న వారు ఉన్నారు. గ్రామాల్లోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ వందశాతం చేరే అవకాశాలు ఉన్నాయి. పట్టణాల్లోనే ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. అత్యధిక మంది ఉండటం, ఒక వార్డులో ఉన్న వారివి మరో వార్డులో ఉండటంతో వారు ఎక్కడ ఫాం ఇవ్వాలో తెలియడం లేదు. కొంతమందికి ఇప్పటి వరకు ఫారాలు అందలేదు. వారు ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గడువు మళ్లీ పెంచే అవకాశాలు లేవని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లో రాజకీయ నాయకులు, కౌన్సిలర్లు ప్రతి ఓటరును కలుస్తూ ఓటరు నమోదు చేసుకోవాలని పేర్కొంటున్నారు. పట్టణాల్లో వందశాతం నమోదయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.


