‘సర్దుబాటు’లో ఇష్టారాజ్యం | - | Sakshi
Sakshi News home page

‘సర్దుబాటు’లో ఇష్టారాజ్యం

Jul 28 2026 12:49 AM | Updated on Jul 28 2026 12:49 AM

● ఉపాధ్యాయుల నుంచి వెల్లువెత్తుతున్న ఆరోపణలు ● అధికారులపై ప్రజాప్రతినిధుల విమర్శల వెల్లువ

రాయికల్‌ మండలం మైతాపూర్‌ గ్రామ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడు ఒక్కడే ఉండగా.. అతడిని కొడిమ్యాలకు బదిలీ చేశారు. అయితే ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదని సమాచారం.

గొల్లపల్లి మండలకేంద్రంలోని పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను తిర్మలాపూర్‌కు సర్దుబాటు చేశారు. వేరే పాఠశాల నుంచి గొల్లపల్లి పాఠశాలకు ఇద్దరిని సర్దుబాటు చేశారు.

మల్లాపూర్‌ మండలకేంద్రంలోని పాఠశాలలో సబ్జెక్ట్‌ టీచర్‌ ఒక్కరే ఉండగా.. ఆ స్కూల్‌ నుంచి మల్యాలకు పోస్టింగ్‌ ఇచ్చారు. కానీ అక్కడ ఒక్క ఉపాధ్యాయుడిని కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ స్కూల్‌లో పోస్టు ఖాళీగా ఉంది. ఇలా జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ఇష్టారాజ్యంగా చేపట్టారని ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

జగిత్యాల: జిల్లాలో ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు ఇష్టారాజ్యంగా మారాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడైతే సబ్జెక్ట్‌ టీచర్లు లేరో అక్కడ నియమిస్తూ.. సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో నిబంధనలు పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా సర్దుబాటు చేపట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు సిఫారసుల ఆధారంగా పలు పాఠశాలల్లో సర్దుబాట్లు జరిగినట్లు ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అవసరమైన పాఠశాలకు ఉపాధ్యాయులను పంపకుండా అనుకూల ప్రాంతాలకు సర్దుబాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు ఉపాధ్యాయులను సమీప ప్రాంతాలకు తీసుకురాగా.. మరికొందరిని నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ దూరంలో ఉన్న పాఠశాలలకు పంపించినట్లు సమాచారం. జిల్లాలో చాలా పాఠశాలల్లో అవసరానికి మించిన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ఈ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఏ ప్రతిపాదికన ఉపాధ్యాయులను ఎంపిక చేశారు..? ఏ పాఠశాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి..? వంటి అంశాలపై స్పష్టత లేకపోవడంతో ఉపాధ్యాయ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి టీచర్ల సర్దుబాటును పారదర్శకంగా చేపట్టాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement