కోరుట్ల: ఇంటర్వ్యూలు లేకుండా ఎస్సీ కార్పొరేషన్ రుణసాయానికి లబ్ధిదారులను ఎంపిక చేసిన విషయమై కలెక్టర్ సత్యప్రసాద్ విచారణకు ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ కింద ఇచ్చే సబ్సిడీ రుణాల ప్రక్రియ తప్పుదారి పట్టిందంటూ కోరుట్లకు చెందిన చిత్తారి శ్రీనివాస్, ఆనంద్, సాయిలు, రమేశ్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ‘ఉత్తుత్తి ఇంటర్వ్యూలు’ శీర్షికన ‘సాక్షి’ ఈనెల 21న కథనం ప్రచురించింది. ఈ కథనంతో కొంతమంది దరఖాస్తుదారులు ప్రజావాణిలో అధికారులకు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణసాయం ఇంటర్వ్యూలకు అధికారులెవరూ రాలేదని, కోరుట్ల మున్సిపల్ అటెండర్లు అప్లికేషన్ ఫారాలు తీసుకుని వెళ్లిపోమ్మన్నారని ఆరోపించారు. కేవలం గంటలోపే 58 మందిని ఎలా ఇంటర్వ్యూ చేస్తారని ప్రశ్నించారు. ఇంటర్వ్యూలు లేకుండా కొంతమంది తమకు నచ్చిన వారిని ఎంపిక చేయడం అన్యాయమన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎంపిక చేసిన లబ్ధిదారులను రద్దు చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్ విచారణ చేపట్టి వాస్తవాలు తేల్చాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ఆదేశించారు.


