మల్యాల: తొలి ఏకాదశిని పురస్కరించుకుని మండలంలోని లంబాడిపల్లిలోగల శ్రీపద్మావతిసమేత ప్రసన్నవేంకటేశ్వర స్వామివారికి శనివారం కోటి తులసీదళార్చన నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ చేసి, పూజలు చేశారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ మరాటి సత్తయ్య, సర్పంచ్ మరాటి సంధ్య, ఆలయ కమిటీ సభ్యులు,
భక్తులు పాల్గొన్నారు.
కోరుట్ల: పింఛన్ డబ్బులు అందుకుని.. ఇప్పటికే చనిపోయిన, ఆచూకీ లేనివారి ఖాతాల్లో ఏకంగా రూ.20 కోట్లు వారివారి బ్యాంకు ఖాతాల్లో ఏళ్లతరబడిగా మూలుగుతున్న తీరు విస్మయం కలిగిస్తోంది. జిల్లాలోని ఐదు బల్దియాల్లో సుమారు 58వేల మంది పింఛన్ పొందుతున్నారు. రెండు నెలల క్రితం పింఛన్‌దారుల ముఖ చిత్రీకరణ కార్యక్రమం కొనసాగింది. ఇది జూన్ 22న ముగిసింది. పింఛన్‌దారుల్లో ఎంతమంది అర్హులు..? ఎంతమంది అనర్హులు..? ఎంతమంది చనిపోయారు..? ఆచూకీ లేని వారు ఎందరు..? అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈలెక్కన ఐదు మున్సిపాలిటీల్లో కలిపి సుమారు రూ.20 కోట్లు ఉన్నట్లు గుర్తించారు.


