మల్యాల: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కొండగట్టు శ్రీఆంజనేయస్వామివారిని శనివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత పుష్పగుచ్ఛం అందించారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వెంకటయ్య మాట్లాడుతూ ఆంజనేయస్వామి వారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు సంమృద్ధిగా కురవాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ఈవో అంజనారెడ్డి, డీఎస్పీ రాములు, ఎస్సీ, ఎస్టీ, కమిషన్ సభ్యులు ప్ర వీణ్, నీలాదేవి, రాంబాబు, శంకర్, ఎస్సీ సంక్షేమాధికారి రాజ్‌కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ తిరుపతి, అర్చకులు పాల్గొన్నారు.
నేరాలు తగ్గించాలి
జగిత్యాలక్రైం: నేరాలు నియంత్రించాలని బాసర జోన్ డీఐజీ భాస్కరన్ అన్నారు. జిల్లాలో శనివారం ఆయన పర్యటించారు. ముందుగా జగిత్యాల పోలీస్ గెస్ట్‌హౌస్‌కు చేరుకోగానే ఎస్పీ అశోక్‌కుమార్ స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఎస్పీ కార్యాలయంలో శాంతిభద్రతలు, నేర నియంత్రణ చర్యలు, భద్రత, సాంకేతిక పరిజ్ఞాన అంశాలపై సమీక్షించారు. జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ రికార్డులు, ఎఫ్‌ఐఆర్‌లు, కేస్‌డైరీలు, సీసీటీఎన్‌ఎస్ నమోదు, స్టేషన్ పరిశుభ్రత, ప్రజలకు అందిస్తున్న సేవల తీరును పరిశీలించారు. ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. స్పెషల్‌బ్రాంచ్ ఐటీకోర్, డిస్ట్రిక్ట్ క్రైం రిపోర్ట్, బ్యూరో, డీసీఆర్బీ కార్యాలయాలను పరిశీలించారు. అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్, సీఐ సుధాకర్, ఎస్సై ఉమాసాగర్, రాజు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఇబ్రహీంపట్నం: వర్షకాలంలో వచ్చే వ్యాధులపై అందరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో సుజాత వైద్య సిబ్బందికి సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, పైలేరియా వంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కూలర్లు, టైర్లు, కొబ్బరిచిప్పలు, ప్లాస్టిక్ వస్తువుల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని తెలిపారు. వారంలో ఒకసారి డ్రైడే పాటించాలని సూచించారు. జిల్లా ప్రోగ్రాం అధికారి నరేంద్ర, వైద్యాధికారులు హరీశ్, వనజ, సిబ్బంది పాల్గొన్నారు.
పారిశుధ్యం మెరుగుపర్చాలి
జగిత్యాలరూరల్: పారిశుధ్యం మెరుగపర్చాలని డీపీవో మదన్‌మోహన్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం పొరండ్లలో ఇటీవల ఇద్దరు చిన్నారులు విషజ్వరాలతో మృతిచెందగా.. శనివారం గ్రామాన్ని సందర్శించారు. ప్రధానవీధులను పరిశీలించారు. రక్షిత మంచి నీటి సరఫరాలో లోటుపాట్లు లేకుండా చూడాలని, దోమల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడారు. సర్పంచ్ నక్క హరీశ్, ఎంపీవో రవిబాబు, ఉపసర్పంచ్ మల్లేశం పాల్గొన్నారు.
జలసిరిపై అవగాహన
పెగడపల్లి: జలసిరిపై గ్రామీణుల్లో అవగాహన కల్పించాలని జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఐకేపీ, వీవోఏలు, వీబీ జీరాంజీ సిబ్బందికి అవగాహ న కల్పించారు. నీటి వనరులను పెంపొందించడం, భావితరాలకు నీటి భద్రత కల్పించడం కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ఇంటికో ఇంకుడుగుంత, గ్రామానికి ఒకటి రెండు చొప్పున నీటి కుంటలు, పాంపాండ్‌లు తవ్వించాల్సిన అవసరముందన్నారు.


