జగిత్యాలఅగ్రికల్చర్: ఆత్మ ద్వారా అందే నిధులు రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలకు వెచ్చించాలని ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా వ్యవసాయాధికారి వడ్డెపల్లి భాస్కర్ అన్నారు. జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఆత్మ జిల్లాస్థాయి రైతు సలహా కమిటీ సమావేశంలో మాట్లాడారు. రైతులకు ఉపయోగపడే క్షేత్ర ప్రదర్శనలు, రైతు శిక్షణ, వివిధ ప్రాంతాల పర్యటనల వంటి కార్యక్రమాలకు పెద్దపీట వేయాలని సూచించారు. రైతు సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు, రసాయన పురుగు మందుల వినియోగాన్ని తగ్గించేందుకు డ్రోన్ల ద్వారా మందులు పిచికారి చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ జాన్ సుధాకర్, ఆత్మ చైర్మన్లు కాటిపల్లి గంగారెడ్డి, తాళ్లపల్లి మల్లేశం, వాకిటి భూమారెడ్డి, శాస్త్రవేత్త వై.స్వాతి పాల్గొన్నారు.


