జగిత్యాలక్రైం: భారతసైన్యం నిర్వహిస్తున్న అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా తన కుమారుడిని యునైటెడ్ అరబ్ ఎమిరెడ్స్ (యూఏఈ) రాజధాని అబుదాబి నుంచి అత్యవసరంగా స్వదేశానికి రప్పించాలని కోరుతూ తల్లి శుక్రవారం హైదరాబాద్‌లోని సీఎం ప్రజావాణిని ఆశ్రయించారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూరుకు చెందిన పోపర్తి అభిలాష్ జగిత్యాలలోని లైసెన్స్ కలిగిన రిక్రూట్ మెంట్ ఏజెన్సీ ద్వారా టూరిస్ట్ వీసాపై ఈనెల 8న ముంబాయ్ నుంచి అబుదాబికి వెళ్లాడు. అనంతరం ఈనెల 13న ఎంప్లాయిమెంట్ వీసా జారీ చేశారు. ఆ సమయంలో సైన్యం నిర్వహిస్తున్న అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో భాగంగా నిర్వహించే ఫిజికల్ స్క్రీనింగ్ (దేహ దారుఢ్య పరీక్ష)కు షార్ట్‌లిస్ట్ అయినట్లు, అతనికి ఈనెల 14న ఈమెయిల్ అందింది. ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీ యజమాన్యం ఇండియాకు తిరిగి వెళ్లాలంటే 4100 యూఏఈ దినార్లు సుమారు ఇండియా రూ.1.08 లక్షలు చెల్లించి వీసా రద్దు చేస్తేనే భారత్‌కు పంపిస్తామని షరతులు విధించారు. ఏజెంట్ కూడా ఇదే విషయం చెబుతున్నాడని అభిలాష్ తల్లి సుమలత వాపోయారు. తన కుమారుడు అగ్నివీర్ ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుని అతన్ని అత్యవసరంగా అబుదాబి నుంచి హైదరాబాధ్‌కు తెప్పించాలని హైదరాబాద్‌లోని బేగంపేట ప్రజాభవన్‌లో సీఎం ప్రవాసి ప్రజావాణిలో ఆమె వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంపై సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ విద్యాసాగర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఆయన పేద కుటుంబానికి చెందిన యువకున్ని తగిన సహాయం అందించి అత్యవసరంగా స్వదేశానికి రప్పించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జీఏడీ)కి లేఖ రాశారు.


