కొడిమ్యాల(చొప్పదండి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కోనాపూర్‌లో శుక్రవారం వేకువజామున పర్వతాలు అనే గ్రామస్తుని గొర్రెల మందపై వీధి కుక్కల దాడి చేశాయి. 25 గొర్రెలు మృతి చెందగా, 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. తీవ్ర గాయాలతో రక్తమోడి విలవిల్లాడుతున్న గొర్రెలను చూసిన పర్వతాలు బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఘటనతో తమ కుటుంబం బతుకు భారమయిందని, రూ.3 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని రోదించాడు. గాయపడిన గొర్రెలకు చికిత్స అందిస్తున్నామని, వాటిలో కూడా కొన్ని చనిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరాడు. బాధితుడిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫోన్‌లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఆందోళన చెందవద్దని సూచిస్తూ, ఘటన వివరాలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకుంటామని బాధితుడికి భరోసా ఇచ్చారు.
బాధితుడికి ఎమ్మెల్యే భరోసా


