జగిత్యాల: జిల్లా కేంద్రం.. అత్యంత రద్దీ గల ప్రాంతాల్లో రోడ్లపైనే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో పార్కింగ్ సమస్యతోపాటు, నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజలు తరచూ ప్రజావాణి, మున్సిపాలిటీలో ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. తాజాగా ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో ఆక్రమణలపై బల్దియా అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. జిల్లా కేంద్రంలో కొన్ని చోట్ల చేసినప్పటికీ ప్రతిచోట ఆక్రమణలను తొలగించేలా చూడాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రధానమైనవి యావర్‌రోడ్, తహసీల్ చౌరస్తా, టవర్‌సర్కిల్, కొత్తబస్టాండ్, పాతబస్టాండ్, గొల్లపల్లి రోడ్, బైపాస్‌రోడ్, ధర్మపురి రోడ్ అత్యంత రద్దీ గల ప్రాంతాలు. రోడ్లపైనే పండ్ల విక్రయ నిర్వాహకులతోపాటు, గాజులు అమ్మేవారు, తాళం చెవులు, డ్రెస్సెస్‌లు అమ్ముకుంటూ చిరువ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ వీరు ఫుట్‌పాత్‌లనే కాకుండా రోడ్లపైకి వచ్చి విక్రయిస్తున్నారు. కొందరైతే ఏకంగా పర్మినెంట్‌గా షెడ్లు వేయడం, రోడ్లపై ఫ్లెక్సీ బోర్డులతో స్టాండ్‌లు ఏర్పాటుచేసుకున్నారు. దీంతో ప్రజలు, వాహనదారులకు నడవడం, వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందికరంగా మారింది. యావర్‌రోడ్, పాతబస్టాండ్‌లో ట్రాఫిక్ విపరీతంగా జామ్ కావడంతో పాటు, ప్రమాదాలు జరుగుతున్నాయి. సాయంత్రం స్కూళ్లు ముగిసిన అనంతరం ఇటు విద్యార్థులు, అటు ఉద్యోగులతో రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి.
ట్రాఫిక్ అస్తవ్యస్తం
యావర్‌రోడ్, పాతబస్టాండ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతా అస్తవ్యస్తంగా మారింది. రోడ్లన్నీ చిన్నవిగా ఉండటం, చిరువ్యాపారులు వ్యాపారాలు చేయడం, వాహనదారులకు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. ట్రాఫిక్ పోలీసులు ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది. టవర్ సర్కిల్‌లో అయితే పెద్ద వాహనాలు రావడంతో వెళ్లడం, రావడం చాలా కష్టతరంగా మారింది. ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రణాళిక ప్రకారం చేపడితే ట్రాఫిక్ నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది. రోడ్లను ఆనుకుని ఉన్న ఆక్రమణలను తొలగిస్తే ట్రాఫిక్ మెరుగుపడే అవకాశాలుంటాయి.
అన్ని తొలగించాల్సిందే..
మున్సిపల్ అధికారులు ఫిర్యాదు వచ్చిన చోటే తాత్కాలికంగా తొలగించడం, మళ్లీ కొద్దిరోజుల అనంతరం షరామామూలే. ఇలా నెలలో రెండుసార్లు చేయడం తప్ప పూర్తిగా తీయలేకపోవడంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకుల ద్వారా ఒత్తిళ్లు తేవడంతో వారు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. పండ్ల బండ్లు, కూరగాయలను ఏకంగా రోడ్లపైనే అమ్ముతున్నారు. మున్సిపల్ అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్నా.. కొన్ని మాత్రమే తీసేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధులు చెబితే కొందరివి తీయకుండా ఆపుతున్నారని చెబుతున్నారు. అన్ని తీస్తే అటు పార్కింగ్, ఇటు వాహనదారులకు ఇబ్బంది ఉండదు. తాజాగా కొన్ని ఫిర్యాదులు రావడంతో యావర్‌రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. ఇదే విధంగా జిల్లా కేంద్రంలోని అన్ని సెంటర్ల వద్ద చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


