పుష్కర సమయం..ఏర్పాట్లు ఘనం | - | Sakshi
Sakshi News home page

పుష్కర సమయం..ఏర్పాట్లు ఘనం

Jul 24 2026 2:09 AM | Updated on Jul 24 2026 2:09 AM

● రూ.117 కోట్లతో ఘాట్ల నిర్మాణం ● శాశ్వత అభివృద్ధి దిశగా అడుగులు ● కుంభమేళా తరహాలో గోదావరి తీరాలు

శాశ్వత అభివృద్ధి పనులు

గొల్లపల్లి: వచ్చే సంవత్సరంలో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా.. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధమైంది. అశేషంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా.. కుంభమేళా స్థాయిలో మౌలిక వసతులు కల్పించేలా బృహత్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. గోదావరి తీరం ఉన్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల రూపురేఖలను మార్చేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ చొరవ తీసుకుంటున్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం తొలి విడతగా రూ.117కోట్లు విడుదల చేసింది. వీటిని జగిత్యాల జిల్లాలోని గోదావరి తీర ప్రాంతాలకే కేటాయించారు.

ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోనున్న ధర్మపురి, కోటిలింగాల

దక్షిణ కాశీగా పేరుగాంచిన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం.. శాతవాహనుల తొలి రాజధానిగా చారిత్రక ప్రాశస్త్యం పొందిన కోటిలింగాలలోని కోటేశ్వర స్వామి, శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాల పరిధిలో ఈ నిధులతో సకల సౌకర్యాలు కల్పించనున్నారు. కోటిలింగాల వద్ద కొత్తగా ఘాట్లు ఏర్పాటు చేయనున్నారు. భక్తులు సురక్షితంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా సరికొత్త మోడల్‌లో స్నానపు ఘాట్ల నిర్మాణానికి రూ.8 కోట్లు కేటాయించారు.

ఆలయాల ఆధునీకరణ

ధర్మపురి, కోటిలింగాల ఆలయాల పరిసరాలను సుందరీకరించడానికి, భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు, షెడ్లు నిర్మించడానికి రూ.10 కోట్ల చొప్పున ప్రత్యేకంగా వెచ్చించనున్నారు. మిగిలిన నిధులను గోదావరికి అనుసంధానంగా ఉన్న అంతర్గత రహదారుల విస్తరణ, రాత్రి వేళల్లో వెలుగులు విరజిమ్మేలా అత్యాధునిక విద్యుద్ధీకరణ, నిరంతర తాగునీరు, పారిశుధ్య పనులకు ఉపయోగించనున్నారు.

మరో రూ.50 కోట్ల అదనపు నిధులకు ప్రతిపాదన

పుష్కరాల సమయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా.. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. ప్రత్యేక బైపాస్‌ రోడ్ల నిర్మాణం కోసం అదనంగా మరో రూ. 50 కోట్లు మంజూరు చేయాలని మంత్రి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

అధికారుల సన్నద్ధత

వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. 12 రోజులపాటు మహా వేడుకల కోసం ప్రభుత్వం ఇప్పటినుంచే యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. నిధులు కేటాయించడంతో టెండర్ల ప్రక్రియను వేగవంతం చేశారు. పుష్కరాల నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

గోదావరి పుష్కరాలను జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం. రూ.117 కోట్ల నిధులతో ధర్మపురి, కోటిలింగాల క్షేత్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం. తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమే కాకుండా.. భవిష్యత్తులోనూ భక్తులకు ఉపయోగపడేలా శాశ్వత ప్రాతిపదికన వసతులు కల్పిస్తాం.

– అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌,

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement