రాయికల్: రాయికల్ పట్టణాభివృద్ధికి ప్రభుత్వం జనవరిలో రూ.15 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో తొమ్మిది అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. అయితే కేవలం ఆరు పనులకు మాత్రమే టెండర్ నిర్వహించారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు నేటికీ కేవలం ఒకే ఒక్క పనికి ముందుకొచ్చారు. మిగతా పనులు ప్రారంభం కాకపోవడంతో పట్టణంలో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. బల్దియాలో 12 వార్డులు ఉన్నాయి. 20,500 వరకు జనాభా ఉంది. పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసిన రూ.15కోట్లతో సీసీరోడ్లు, బీటీరోడ్లకు రూ.15 లక్షలు, జంక్షన్ డెవలప్‌మెంట్‌కు రూ.కోటి, మాదిగకుంటలో నీటి తొలగింపు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.5 కోట్లు, మత్తడి వద్ద రిటర్నింగ్ వాల్ కోసం రూ.20 లక్షలు, మురికికాలువల కోసం రూ.3.15 కోట్లు, శ్మశాన వాటికకు రూ.50 లక్షలు, వీధి దీపాల కోసం రూ.కోటి, పార్క్, ఓపెన్ జిమ్ కోసం రూ.50 లక్షలు, పటేల్ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు డివైడర్లు, మొక్కల పెంపకానికి రూ.50 లక్షల చొప్పున మంజూరు చేశారు.
ప్రారంభం కాని పనులు
మొత్తంగా తొమ్మిది పనులకు టెండర్ నిర్వహించినప్పటికీ కేవలం ఆరు పనులకు మాత్రమే కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. టెండర్లు కానివాటిలో పటేల్ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు డివైడర్ల నిర్మాణం, శ్మశాన వాటిక అభివృద్ధి పనులు, సీసీ, బీటీ రోడ్డు పనులు ఉన్నాయి. పాలకమండలి సభ్యులు, అధికారులు స్పందించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని కౌన్సిలర్లు, ప్రజలు కోరుతున్నారు.
రాయికల్ బల్దియా వివరాలు
వార్డులు 12
జనాభా 20,500
విడుదలైన నిధులు రూ.15 కోట్లు
టెండర్ ద్వారా పనులు 9
టెండర్ అయినవి 6
టెండర్ కానివి 3


