వచ్చిన కరువు కాదు.. రేవంత్‌ తెచ్చింది | - | Sakshi
Sakshi News home page

వచ్చిన కరువు కాదు.. రేవంత్‌ తెచ్చింది

Jul 24 2026 2:09 AM | Updated on Jul 24 2026 2:09 AM

ఎన్‌డీఎస్‌ఏ నెపంతో రాష్ట్రాన్ని ఎడారిగా మారుస్తారా?

గతంలో చంద్రబాబు, ప్రస్తుతం రేవంత్‌ పాలనలో కరువు

మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి

జగిత్యాలటౌన్‌: మేడిగడ్డ మరమ్మతు చేసేవరకూ కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోయవద్దని ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టులో ఎక్కడా పేర్కొనలేదని, ఆ నెపంతో రాష్ట్రాన్ని ఎడారిగా మార్చొద్దని మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఇది వచ్చిన కరువు కాదని, రేవంత్‌ తెచ్చిన కరువు అని తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంతతో కలిసి గురువారం విలేకరులతో మాట్లాడారు. అప్పుడు చంద్రబాబు హయాంలో కరువు వస్తే.. ఇప్పుడు రేవంత్‌ హయాంలో వచ్చిందని గుర్తు చేశారు. నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ కరువుకు ప్రభుత్వం కారణమవుతోందని ఆరోపించారు. ప్రత్యేక పరిస్థితుల్లో నీటిని వినియోగించుకోవచ్చని ఎన్‌డీఎస్‌ఏ సభ్యుడు రాజేష్‌ తోతెజ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నీటిరంగ నిపుణుడు వెదిర శ్రీరాం కూడా నీటిని ఎత్తిపోయాలని పేర్కొన్నారని, ఒక్క రేవంత్‌రెడ్డి తప్ప ప్రతిఒక్కరూ నీటిని ఎత్తి పోయవచ్చన్నారని తెలిపారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే కుట్రతోనే రేవంత్‌రెడ్డి నీటిని ఎత్తిపోయడానికి ఇష్టపడటం లేదన్నారు. కేసీఆర్‌పై ఈర్ష, ద్వేషంతోనే కుంగిన పిల్లర్లకు మరమ్మతు చేయడం లేదని విమర్శించారు. ఎల్‌నినోతో ఏర్పడిన కరువును ఎదుర్కోవడానికి ప్రాణహిత జలాలను కన్నెపల్లి పంప్‌హౌజ్‌ ద్వారా ఎత్తిపోయాలని కోరారు. ఆయన వెంట నాయకులు గాజుల రాజేందర్‌, పుప్పాల అశోక్‌, ఒల్లం మల్లేశం, కల్లెపెల్లి దుర్గయ్య, చందా రాధాకిషన్‌, నక్క జీవన్‌, అబ్దుల్‌ బారీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement