ఎల్‌నినో వర్షాలు | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో వర్షాలు

Jul 13 2026 1:22 AM | Updated on Jul 13 2026 1:22 AM

● పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ● జిల్లాలో 29 శాతం లోటు వర్షపాతం ● పంటలు కాపాడుకునేందుకు రైతుల ఇక్కట్లు

జగిత్యాలఅగ్రికల్చర్‌:

నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో వర్షాలకు విరామం ఏర్పడింది. దీంతో

ఉష్ణోగ్రతలు మళ్లీ 32 నుంచి 35 డిగ్రీల గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ఇటీవలి వర్షాలకు వేసిన మొక్కజొన్న, పసుపు వంటి పంటలు వళ్లిపోతున్నాయి. ఇంకా కొన్ని పంటలు మొలకెత్తలేదు. రైతులు వ్యవసాయ బావుల్లో ఉన్న నీటితో పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో నాలుగైదు రోజులు పొడి వాతావరణమే ఉండే అవకాశం ఉందని పొలాస వాతావరణ శాస్త్రవేత్తలు

చెపుతున్నారు.

వర్షాకాలం ప్రారంభమై నెలన్నర గడిచినప్పటికీ వర్షపాతం అంతంతమాత్రంగానే ఉంది. జిల్లాలో 29 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 232.5 మిల్లీమీటర్లకు 164.2 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. వెల్గటూర్‌ మండలంలో మాత్రమే 31శాతం అధిక వర్షపాతం కురిసింది. మిగతా అన్ని మండలాల్లో లోటు వర్షపాతమే. మండలాల వారీగా చూస్తే గొల్లపల్లిలో 56శాతం, ఇబ్రహీంపట్నంలో 55, కొడిమ్యాల, భీమారంలో 47, పెగడపల్లిలో 43, కోరుట్లలో 41, సారంగాపూర్‌లో 39, జగిత్యాల రూరల్‌లో 35, జగిత్యాల అర్బన్‌లో 34, కథలాపూర్‌, రాయికల్‌, బీర్‌పూర్‌లో 33, మెట్‌పల్లిలో 32, మల్లాపూర్‌లో 28, బుగ్గారంలో 29, ఎండపల్లిలో 12, ధర్మపురిలో 9, మేడిపల్లిలో 8, మల్యాలలో 4 శాతం లోటు వర్షపాతం నమోదైంది. భారీ వర్షం ఒక్కటీ లేకపోవడంతో భూగర్భజలాలు పెరగడంలేదు.

రుతుపవనాలకు బ్రేక్‌

రుతుపవనాలు వచ్చినా అల్పపీడనాలు ఆశించిన స్థాయిలో ఏర్పడకపోవడంతో వర్షాలకు తాత్కలికంగా బ్రేక్‌ పడింది. వాతావరణంలో తేమశాతం తగ్గి.. పొడిగాలులు వీస్తుండడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫలితంగా ఉక్కపోత మొదలైంది. గ్లోబల్‌వార్మింగ్‌ ప్రభావంతో వర్షాలకు అంతరాలు ఏర్పడుతున్నాయి.

రైతన్నల పాట్లు

అదనుదాటి పోతుందనే ఉద్దేశంతో అడపాదడపా కురిసిన వర్షాలకు విత్తనాలు వేసిన రైతులు.. మొలకలను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. బావులు, బోర్లలో ఉన్న నీటిని డ్రిప్‌, స్ప్రింక్లర్ల ద్వారా పంటలకు అందిస్తున్నారు. డ్రిప్‌ వ్యవస్థ లేని రైతులు కాలువల ద్వారా నీటిని పారించే ప్రయత్నం చేస్తున్నారు. పొలం సిద్ధం చేసే వరకు వర్షాలు కురుస్తాయనే నమ్మకంతో రైతులు ఉన్నారు. నీరు సరిపోకపోవడంతో రైతులు పొక్లెయిన్స్‌, జేసీబీలతో బావుల్లో పూడిక తీయించే పనిలో పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement