కేంద్రీయ విద్యాలయానికి ఐదెకరాలు కేటాయింపు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి భవన నిర్మాణానికి శ్రీకారం
జగిత్యాలరూరల్: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్‌లోని వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి ఎంపీ అర్వింద్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్, మేడిపల్లి సత్యంతో కలిసి ఆదివారం భూమిపూజ చేశారు. విద్యాలయానికి కేటాయించిన భూమి రైతులదని, కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఎమ్మెల్యే సంజయ్ కృషితో ప్రభుత్వం ఐదెకరాలు కేటాయించిందని తెలిపారు. ధర్మపురి నియోజకవర్గానికి కూడా విద్యాసంస్థలు తేవాలని ఎంపీని కోరారు. ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణకు 39 కేంద్రీయ విద్యాలయాలు మంజూరుకాగా.. 37 కొనసాగుతున్నాయని, నాణ్యమైన విద్యకు నిలయంగా మారాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులు పిల్లలకు ప్రవేశాల్లో అవకాశం ఉంటుందన్నారు. జగిత్యాలకు కేవీని మంజూరు చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. విప్ మాట్లాడుతూ జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం రావ డం గర్వకారణమన్నారు. సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయించాలని ఎంపీని కోరారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ శాశ్వత భవనం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనంలో తరగుతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఎమ్మెల్యేగా విద్యాసంస్థను తేవడానికి నిరంతరం కృషి చేశానని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం తదితర విద్యా సంస్థలు ఒకే ప్రాంతంలో ఏర్పాటు కానున్నాయని అన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, మార్కెట్ చైర్మన్ నారాయణ రెడ్డి, సర్పంచ్ జున్ను రాజేందర్, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు.


