విద్యుత్‌ శాఖలో ‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ శాఖలో ‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’

Jul 13 2026 1:22 AM | Updated on Jul 13 2026 1:22 AM

● డుమ్మా కొట్టే వారికి ఇకనుంచి చెక్‌ ● జేఎల్‌ఎం నుంచి ఎస్‌ఈ స్థాయి వరకు.. ● అందరికీ ఒకే రూల్‌ వర్తించేలా చర్యలు

గొల్లపల్లి: విద్యుత్‌ శాఖలో ఇకపై కార్యాలయాలకు రాకుండా వచ్చినట్లు సంతకాలు పెట్టి వెళ్లిపోయే అధికారుల పాత పద్ధతులకు కాలం చెల్లింది. ఇందుకోసం ప్రభుత్వం కొత్తగా ఫేస్‌ రికగ్నైషన్‌ విధానాన్ని తీసుకొచ్చింది. జూనియర్‌ లైన్‌మెన్‌ స్థాయి ఉద్యోగి నుంచి సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ వరకు ప్రతిఒక్కరూ డిజిటల్‌ హాజరు పరిధిలోకి రానున్నారు. మొదటగా ఈ విధానాన్ని డివిజన్‌, జిల్లా కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి, రెండోవిడతగా గ్రామాల్లోని సబ్‌స్టేషన్ల స్థాయికి విస్తరించనున్నారు. ఈ స్థాయి అధికారులు జిల్లాలో 1320 మంది వరకు పనిచేస్తున్నారు.

రోజుకు రెండుసార్లు పంచ్‌.. లేదంటే ‘సెలవే’:

ఈ విధానం ప్రకారం ప్రతి ఉద్యోగి తన పర్సనల్‌ స్మార్ట్‌ఫోన్‌లో ఎన్‌పీడీసీఎల్‌ ఎంప్లాయ్‌ పోర్టల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందులో ఉద్యోగి ఐడీ, హోదా, వారు పనిచేసే లొకేషన్‌ (జియో ఫెన్సింగ్‌) లింక్‌ అయి ఉంటాయి. ఉదయం 10 గంటల లోపు మొదటిసారి యాప్‌ ద్వారా ముఖం చూపించి హాజరు నమోదు చేయాలి. తిరిగి విధి నిర్వహణ ముగించుకుని సాయంత్రం 6 గంటలకు రెండోసారి హాజరు వేయాలి. రోజులో రెండుసార్లలో ఏ ఒక్కసారి హాజరు నమోదు చేయకపోయినా ఆ రోజును సెలవుగానే పరిగణిస్తారు. ఆలస్యంగా వస్తే ఆ రోజు వేతనంలో కోత విధిస్తారు.

అప్‌అండ్‌డౌన్‌ అధికారులకు చెక్‌

వాస్తవానికి విద్యుత్‌ శాఖ సిబ్బంది జిల్లాలో పనిచేస్తున్నప్పటికీ చాలావరకు కరీంనగర్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి ప్రతిరోజూ అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ విషయమై కొందరు అధికారుల తీరుపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వీరు సకాలంలో విధులకు రాకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. కిందిస్థాయి సిబ్బంది మాత్రం గ్రామాల్లోనే అందుబాటులో ఉంటున్నారు. ఈ కొత్త యాప్‌ రాకతో పొరుగుజిల్లాల నుంచి ఆలస్యంగా వచ్చే ఏ అధికారి కూడా ఇకపై తప్పించుకునే వీలుండదు. నిర్ణీత లొకేషన్‌లో ఉంటేనే యాప్‌ హాజరును స్వీకరిస్తుంది.

యాప్‌లోనే సర్వస్వం

యాప్‌ కేవలం హాజరుకే పరిమితం కాలేదు. ఉద్యోగుల వార్షిక, నెలవారీ లీవ్‌ల వివరాలు, వారి ఖాతాలో ఇంకా ఎన్ని సెలవులు మిగిలి ఉన్నాయనే డేటా మొత్తం డిజిటల్‌ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది.కొత్త డిజిటల్‌ విధానంతో సబ్‌ స్టేషన్లు, ఉపకేంద్రాల పరిధిలోనే ఉద్యోగులు కచ్చితంగా అందుబాటులో ఉండాల్సి వస్తుంది. సొంత పనులపై బయటకు తిరిగే వీలుండదు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కానీ, సాధారణ ప్రజలకు కానీ విద్యుత్‌ సమస్యలు తలెత్తినప్పుడు సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే అవకాశం కలుగుతుంది. ఈ మార్పును నిజాయితీగా పనిచేసే కొందరు ఉద్యోగులు మనస్ఫూర్తిగా స్వాగతిస్తుండగా.. ఎగ్గొట్టే అలవాటున్న మరికొందరు ఉద్యోగులు మాత్రం అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారు. విద్యుత్‌ శాఖలో రాబోయే ఈ ఎఫ్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థ జవాబుదారీతనాన్ని పెంచుతుందని పలువురు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement