‘ఇందిరమ్మ’కు కొత్త నిబంధనలు | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’కు కొత్త నిబంధనలు

Jul 8 2026 2:08 AM | Updated on Jul 8 2026 2:08 AM

పైకప్పు విస్తీర్ణం 700 చదరపు అడుగులు మాత్రమే ఎక్కువ నిర్మించుకుంటే బిల్లులకు కష్టమే.. లబ్ధిదారులపై తగ్గనున్న ఆర్థిక భారం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం కొత్త నిబంధనలు విడుదల చేసింది. పైకప్పు విస్తీర్ణం 750 చదరపు అడుగులు ఉండేందుకు పరిమితం చేశారు. నిబంధనల మేరకే నిర్మించాలని, పైకప్పు విస్తీర్ణం పెంచుకుంటే ఆర్థిక భారం పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కొందరు లబ్ధిదారులు తలుపులు, కిటికీలు, ఇతరత్రా వాటి కోసం అన్ని వైపులా స్లాబులు పెంచుకుంటూ పోతున్నారు. స్లాబ్‌ పెంచితే అత్యధిక ఖర్చు వస్తుంది. దీనిని ఉద్దేశించే దీనికి నిబంధనలు విధించారు. నూతనంగా స్లాబ్‌ నిర్మించే వారికే ఇది వర్తిస్తుంది. ఇప్పటికే నిర్మించుకున్న వారికి ఈ నిబంధన వర్తించదు. రూప్‌లెవల్‌, బేస్‌మెంట్‌ దశలో ఉన్న నిర్మాణాలతోపాటు, కొత్తగా నిర్మించుకునే వారికే ఈ నిబంధన వర్తిస్తుంది.

ఆర్థిక భారం..

పేదల సొంతింటి కలను నెరవేర్చాలని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. మొదటి విడతలో 10,860 ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు 1546 మాత్రమే పూర్తయ్యాయి. ఇందిరమ్మ ఇళ్లకు ఐదు విడతల్లో నిధులు విడుదల చేస్తున్నారు. బేస్‌మెంట్‌ వేసినప్పుడు రూ.లక్ష, గోడలకు రూ.లక్ష, స్లాబ్‌ పడ్డాక రూ.1.40 లక్షలు, మిగతావి రూ.1.60 లక్షలు వేస్తున్నారు. మొత్తం రూ.5 లక్షల వరకు వేస్తున్నప్పటికీ లబ్ధిదారులకు మాత్రం అప్పులు తప్పడం లేదు. దర్వాజలు, కిటికీలకే కొంతమంది లబ్ధిదారులు టేకు పెట్టుకోవడంతో వాటికే రూ.2లక్షల నుంచి రూ.3 లక్షలు అవుతున్నాయని పేర్కొంటున్నారు. ఇంట్లో ఎలాంటి స్టోన్స్‌ వేసుకోకున్నా.. సిమెంట్‌ వాడినా అత్యధికంగా ఖర్చు వస్తోందని పేర్కొంటున్నారు. కరెంట్‌, నల్లాలు, ట్యాంకులు నిర్మించుకోవాలన్నా అదనపు భారం పడుతోంది. దీంతో ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టడంతో ఎలాగైనా పూర్తి చేసుకోవాలని అప్పు తెచ్చుకుంటూ ఇళ్లు పూర్తి చేస్తున్నారు. మహిళా సంఘాల ద్వారా రుణాలు అందజేస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటన్నింటిని ఉద్దేశించుకుని కొంత మేర ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిబంధనలు తీసుకొచ్చింది.

బిల్లులు రాక ఇబ్బందులు

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇప్పటికే రూ.15.46 కోట్ల బకాయిలున్నాయి. ఇందులో కొన్ని కేంద్రం నుంచి వచ్చే నిధులు ఉండటంతో జాప్యం జరుగుతోంది. వెంటనే లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేలా చూడాలని కోరుతున్నారు.

జగిత్యాల: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త నిబంధనలు వచ్చాయి. లబ్ధిదారులకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది. ఇళ్ల నిర్మాణం స్లాబ్‌ 600 చదరపు అడుగుల విస్తీర్ణానికి పరిమితమైనప్పటికీ కొందరు లబ్ధిదారులు అత్యధికంగా వెయ్యి నుంచి 1200 వరకు నిర్మిస్తున్నారు. దీంతో లబ్ధిదారులపై ఆర్థిక భారం పడుతోంది. ప్రభుత్వం ఇచ్చిన స్ట్రక్చర్‌ నిర్మించకుండా కొందరు మేసీ్త్రలు ఇలా నిర్మించుకుంటే బాగుంటుందని చెబుతుండడంతో వారి మాటలు విని ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లు చేపడుతున్నారు. డిజైన్లలోనూ మార్పు చేసుకుంటున్నారు. దీంతో వారిపై ఆర్థిక భారం పడుతోంది. దీంతో ప్రభుత్వం స్లాబ్‌ విషయంలో కొంత పరిమితిని విధించింది.

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల వివరాలు

మంజూరైన ఇళ్లు 10,860

బేస్‌మెంట్‌ వరకు పూర్తయినవి 1329

గోడల వరకు పూర్తయినవి 831

స్లాబ్‌ల వరకు పూర్తయినవి 4170

గృహ ప్రవేశం చేసినవి 1546

నిబంధనల మేరకే నిర్మాణాలు చేసుకోవాలి

నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలి. ప్లింత్‌ ఏరియా 750 చదరపు అడుగుల వరకే ఉండాలి. నూతనంగా బేస్‌మెంట్‌ వరకు పూర్తయిన వారు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. లేనిచో ఈ యాప్‌లో నమోదు కాదు. దీంతో బిల్లులు రాక ఇబ్బందులు పడతారు. లబ్ధిదారులు గ్రహించాలి.

– భాస్కర్‌, గృహ నిర్మాణ శాఖ పీడీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement