పోలీస్ అవినీతిపై పెద్దపల్లి కలెక్టర్ ఆగ్రహం
ఒక్కొక్కరి వ్యవహారాలు తనకు తెలుసంటూ హెచ్చరిక
కలెక్టర్ క్లాస్ తీసుకోవడంపై డిపార్ట్‌మెంట్‌లో తీవ్ర చర్చ
రామగుండం సీపీ దృష్టికి తీసుకెళ్తే బాగుండేదని అభిప్రాయం
కలెక్టర్ తీరును స్వాగతిస్తున్న మరికొందరు పోలీసులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లాలో పోలీస్ వర్సెస్ కలెక్టర్ వివాదం నివురుగప్పిన నిప్పులా మారుతోంది. ఇటీవల పోలీస్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్లతో కలెక్టర్ కోయ శ్రీహర్ష సమావేశమయ్యారు. ఇందులో పలువురు పోలీసు అధికారుల అవినీతిని కలెక్టర్ ఎండగట్టారన్న విషయం బయటికి పొక్కడం చర్చనీయాంశంగా మారింది. ఎస్సై నుంచి ఏసీపీ స్థాయి అధికారులు ఇతర వ్యాపకాల వైపు మళ్లున్నారని, తీరు మార్చుకోవాలని సున్నితంగా హెచ్చరించడం జిల్లావ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ విషయంపై శ్రీసాక్షిశ్రీ పలువురు సీనియర్ పోలీసు అధికారులను కదిలించగా.. కలెక్టర్ మందలించిన విషయం వాస్తవమేనని అంగీకరించారు. మునుపెన్నడూ లేని విధంగా డిపార్ట్‌మెంట్ అధికారులను కలెక్టర్ నేరుగా హెచ్చరించడం జరగలేదని, తమను మందలించాలనుకుంటే ఈ విషయాన్ని తమ బాస్ అయిన రామగుండం సీపీ దృష్టికి తీసుకెళ్లి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.
దెబ్బతిన్న పోలీసు అహం
పెద్దపల్లి కల్టెర్ అందరిముందు నిలదీయడంతో ఆయా పోలీసుల అధికారుల అహం దెబ్బతింది. కలెక్టర్‌తో తమ పరువు పోయిందని మదనపడుతున్నారు. తప్పు చేసిన పోలీసులను కలెక్టర్ నేరుగా మందలించడం తామెప్పుడూ చూడలేదని, తాజా ఘటనతో తాము తలెత్తుకోలేకపోతున్నామని పలువురు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు దారితప్పుతున్న పోలీసు అధికారులను మందలిస్తే తప్పేంటని మరికొందరు కలెక్టర్‌ను సమర్థిస్తున్నారు. మొత్తానికి కలెక్టర్ మందలింపును ప్రజలు, ఇతర డిపార్ట్‌మెంట్లు స్వాగతిస్తుండగా.. పోలీసుశాఖలోని కొందరు మాత్రం ఇది తమకు జరిగిన అవమానంగా భావిస్తున్నారు. మొత్తానికి కలెక్టర్ వ్యవహారంపై పోలీసుశాఖ రెండుగా చీలిపోయింది. ఇలాంటి వివాదాలు సర్వసాధారణమేనని, దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని రెవెన్యూ, పోలీసు శాఖలో సీనియర్ అధికారులు స్పష్టంచేస్తున్నారు.
గతంలో కరీంనగర్‌లోనూ..
పెద్దపల్లి జిల్లాలో పోలీసులు కలెక్టర్ మధ్య వివాదాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు గతేడాది కరీంనగర్‌లో జరిగిన ఘటనను గుర్తుకుతెచ్చుకుంటున్నారు. 2025 జనవరిలో సీపీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం మధ్య పోలీసు స్పోర్ట్స్‌మీట్ సందర్భంగా ఇదే రకంగా విభేదాలు పొడసూపాయి. దీంతో కలెక్టరేట్ నుంచి పోలీసులకు సహాయ నిరాకరణ మొదలైంది. పోలీసులు నిర్వహించిన స్పోర్ట్స్‌మీట్‌కు అన్నిరకాలుగా పోలీసులను ఇబ్బందులకు గురిచేశారు. అప్పట్లో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా దుమారమే లేపింది. అన్ని మీడియాలోనూ ఈ వివాదమే పతాక శీర్షికన నిలిచింది. చివరకు ఈ వివాదం ఏకంగా డీజీపీ వరకు వెళ్లింది. మొత్తానికి డీజీపీ జోక్యంతో ఆ వివాదం సద్దుమణిగింది.


