కార్పొరేట్‌కు ధీటుగా కేజీబీవీలు | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌కు ధీటుగా కేజీబీవీలు

Jul 8 2026 2:08 AM | Updated on Jul 8 2026 2:08 AM

అందనున్న నాణ్యమైన విద్య జేఈఈ, నీట్‌, ఎప్‌సెట్‌లో విద్యార్థులకు శిక్షణ జిల్లాలో మూడు విద్యాలయాలు ఎంపిక ఈనెల 12న ప్రవేశ పరీక్ష

జగిత్యాల: గ్రామీణ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 6వ తరగతి నుంచే జేఈఈ, నీట్‌, క్లాట్‌, ఎప్‌సెట్‌ వంటి పోటీ పరీక్షలకు సంసిద్ధం చేయడానికి జిల్లాలో మూడు కేజీబీవీలను ఎంపిక చేశారు. పేద, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు జేఈఈ, నీట్‌, క్లాట్‌, ఎప్‌సెట్‌ వంటి పోటీ పరీక్షలకు ఆర్థికంగా లేకపోవడంతో కోచింగ్‌లకు వెళ్లడానికి ఇబ్బంది పడేవారు. దీంతో డిగ్రీ, ఇతరత్రా కోర్సులు మాత్రమే చేసేవారు. కేజీబీవీల ద్వారా 6వ తరగతి నుంచే ఆ స్టాండర్డ్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పటినుంచే పోటీ పరీక్షలకు సంసిద్ధం చేస్తున్నారు. పెద్దపెద్ద కోర్సుల్లో సీట్లు రావాలంటే మొదటి నుంచే అన్ని సబ్జెక్ట్‌లలో పట్టు ఉండాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో సీట్లు రావడం కష్టతరంగా ఉంటుంది. ప్రైవేటు పాఠశాలల్లో చదివిన వారే పోటీ పరీక్షల్లో అత్యధిక సీట్లు సాధిస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇలాంటి కోర్సుల్లో సీట్లు సాధించి కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు సాధించేలా సిద్ధం చేస్తున్నారు.

మూడు కేజీబీవీల ఎంపిక

జిల్లాలో మొత్తం 13 కేజీబీవీలు ఉన్నాయి. ఇందులో జగిత్యాల, ఇబ్రహీంపట్నం, కోరుట్లలోని కేజీబీవీలను ఎంపిక చేశారు. జగిత్యాలలో నీట్‌, ఎప్‌సెట్‌, కోరుట్లలో జేఈఈ, ఎప్‌సెట్‌, ఇబ్రహీంపట్నంలో క్లాట్‌ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన ఉపాధ్యాయులను నియమించనున్నారు. ఆధునాతన లైబ్రరీ, కంప్యూటర్‌ ల్యాబ్‌, వ్యక్తిత్వ వికాస తరగతులు, కెరీర్‌ గైడెన్స్‌ ఉంటుంది. విద్యార్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది. ఇందులో ఆధునాతన డిజిటల్‌ తరగతి గదులు ఏర్పాటు చేయడంతోపాటు యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది 20 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. జిల్లాలోని 13 కేజీబీవీల్లో 6వ తరగతి విద్యార్థులకే ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అర్హత సాధించిన వారు ఈ కేజీబీవీల్లో చేరనున్నారు. వీరికి ఆయా కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 12న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించగా.. దాదాపు 200కు పైగా వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

నాణ్యమైన విద్య

ఇలాంటి కోర్సుల్లో మొదటి నుంచే శిక్షణ పొందితే ర్యాంక్‌ సాధించడంతోపాటు, ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించవచ్చు. ప్రైవేటు పాఠశాలల్లో మొదటి నుంచే ఇంగ్లిష్‌ మీడియం కావడం, ఇలాంటి కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతోనే వారు ర్యాంకులు సాధిస్తున్నారు. కేజీబీవీల్లో కూడా ఇలాంటి శిక్షణ ఇవ్వడంతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది.

కార్పొరేట్‌కు ధీటుగా..

కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా కస్తూర్భా పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి. మంచి వాతావరణం కల్పించడంతో పాట, డిజిటల్‌ తరగతుల ఏర్పాటు, యోగా, విశాలమైన లైబ్రరి, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, నైపుణ్యం ఉన్న టీచర్లను నియమిస్తున్నారు. ఈ సంవత్సరం నుంచే ఇవి అందుబాటులోకి రానున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement