జగిత్యాల: సోషల్ వెల్ఫేర్ శాఖలో అనేక అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని, రూ.వందల కోట్ల కమీషన్ల కోసమే కాంట్రాక్ట్‌లను ఇతర రాష్ట్ర కంపెనీలకు ఇస్తున్నారని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సోషల్ వెల్ఫేర్ శాఖలో అక్రమాలపై హరీశ్‌రావు, ప్రవీణ్‌కుమార్ బయటపెడితే ప్రభుత్వం ఎందుకు రాద్దాంతం చేస్తోందని ప్రశ్నించారు. లీడ్‌క్యాప్ సంస్థ వారు కాంట్రాక్టు విషయంలో అన్యాయం జరిగిందంటున్నారని తెలిపారు. గుజరాత్‌కు చెందిన మఫత్‌లాల్ కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టారని ఆరోపించారు. మంత్రి లక్ష్మణ్‌కుమార్ జీవో నంబర్ 1, జీవో 110పై సమాధానం చెప్పాలని, ఈ రెండు జీవోలు అమలులో ఉండగా.. జీవో నంబరు 17 ద్వారా టీఎంయూ ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. ఈ జీవోతో 40వేల చేనేత కార్మికుల కుటుంబాలు, వేలాది మంది చర్మకారుల ఉపాధి దెబ్బతిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఎస్సీ మోచీ కార్మికుల రక్షణకు ఈ జీవోలు తెచ్చారని, వాటిని రద్దు చేయడమేంటని ప్రశ్నించారు. సోషల్ వెల్ఫేర్, ప్రభుత్వ పాఠశాల, హాస్టళ్లకు సంబంధించి రూ.వేల కోట్ల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, జలేందర్ పాల్గొన్నారు.


