జగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్‌లో వరి సాగు తగ్గించాలని అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రైతులు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ప్రభుత్వం సూచించిన సన్నరకాలు సాగు చేయాలని అవగాహన కలిగిస్తున్నప్పటికీ.. రైతులు మాత్రం దొడ్డు రకాలవైపే దృష్టి పెడుతున్నారు. మరోవైపు మామిడి తోటలు, అక్కడక్కడ ఆయిల్ పాం తోటలను తొలగించి మరీ వరి వైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం రైతులు నార్లు పోసే పనిలో పడుతున్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో జిల్లా అధికార యంత్రాంగం, వ్యవసాయ, ఉద్యానశాఖలు అప్రమత్తం అవుతున్నాయి.
దొడ్డు ధాన్యం వైపే రైతులు
ప్రభుత్వం సూచించిన సన్న రకాలు సాగుచేస్తేనే మద్దతు ధరకు తోడు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. అయితే సన్న రకాలు సాగు చేస్తే తెగుళ్లు, పురుగుల బెడద ఎక్కువగా ఉంటుందని, దిగుబడి కూడా ఎకరాకు 20 క్వింటాళ్లకు మించి రాదంటూ ముందుకు రావడం లేదు. అక్కడక్కడ కొంతమేర సన్న రకాలు సాగు చేస్తున్నప్పటికీ మెజార్టీ రైతులు దొడ్డు రకాలే సాగు చేసేందుకు నార్లు పోస్తున్నారు. దొడ్డు ధాన్యం ఎకరాకు 25 నుంచి 28 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, పెద్దగా తెగుళ్లు రావని రైతుల నమ్మకం. దొడ్డు ధాన్యం కొనుగోలు చేయబోమని ప్రభుత్వం ప్రకటన చేయలేదని, ఎలాగైనా కొంటుందనే నమ్మకంతో రైతులు దృష్టి పెట్టారు.
పండ్లతోటలు తొలగించి..
జగిత్యాల జిల్లాలో మూడేళ్ల వరకు 50వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండేవి. పంట సరిగా రావడం లేదని ఏటా నాలుగైదు వేల ఎకరాల తోటలు నరికేయడంతో ప్రస్తుతం 38వేల ఎకరాలకు చేరింది. తోటల స్థానంలో నీటి వసతిని బట్టి వరి పొలాలు సాగు చేస్తున్నారు. వరికి నాటు వేసేటప్పుడు, కోసేటప్పుడు మాత్రమే పని ఉంటుందని, మిగతా సమయంలో పెద్దగా పని ఉండదని, యంత్రాలు రావడంతో ఆ పనులు కూడా సులభం అయ్యాయని రైతులు భావిస్తున్నారు. పైగా క్వింటాల్‌కు గ్రేడ్ ఏ రకానికి రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441గా ఉంది. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఉండటంతో ఈజీగా అమ్ముకోవచ్చని రైతులు భావిస్తున్నారు. మరికొన్ని చోట్ల, ఆయిల్ పాం సాగు చేసినప్పటికీ నాలుగైదేళ్లు ఆగే ఓపిక లేక అక్కడక్కడ ఆ తోటలు తొలగించి వరి వైపు మొగ్గు చూపుతున్నారు. ఉద్యానశాఖ మేల్కోని, ఇప్పుడిప్పుడే పండ్లతోటలు నరికివేయవద్దంటూ రైతు సదస్సులు నిర్వహిస్తున్నారు.
వరి వద్దంటున్న అధికార యంత్రాంగం
సన్నాలు, దొడ్డు ధాన్యం కాదని.. అసలు వరి పంటే తగ్గించాలని అధికార యంత్రాంగం రైతులకు సూచిస్తోంది. మొన్నటి వరకు నాట్లు వేసేందుకు వచ్చే పశ్చిమబెంగాల్ కూలీలు ఇప్పుడు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. హార్వెస్టర్ల డ్రైవర్లు జిల్లాకు రావడం లేదు. ధాన్యం తూకం వేసేందుకు బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి హమాలీలు రావడంలేదు. సివిల్‌సప్‌లై సేకరించిన బియ్యాన్ని ఎఫ్‌సీఐ పెద్దగా తీసుకోవడం లేదని, గోదాంలు, రైస్‌మిల్లులు నిండిపోవడంతో ఇతర జిల్లాల గోదాంలకు ధాన్యం పంపించాల్సి వచ్చిందని స్వయంగా కలెక్టర్ రైతులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
అధికారులు అవగాహన కల్పిస్తున్నా అంతంతే..
జగిత్యాలలో 3.15 లక్షల ఎకరాల్లో సాగుకు సిద్ధం
సన్నాలు తక్కువ.. దొడ్డు రకాలే ఎక్కువ
పండ్ల తోటలు తొలగించి మరీ వరి పొలాలు


