రైలు ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని వ్యక్తి మృతి

Jul 8 2026 2:08 AM | Updated on Jul 8 2026 2:08 AM

ఓదెల: పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి – బిజిగిరిషరీఫ్‌ రైల్వేస్టేషన్ల మధ్య మానేరు వంతెన సమీప డౌన్‌లైన్‌పై రైలు ఢీకొని వ్యక్తి(45) మృతిచెందాడని రామగుండం రైల్వేపోలీస్‌ హెడ్‌కానిస్టేబుల్‌ తిరుపతి తెలిపారు. మృతుడు గ్రీన్‌కలర్‌ ఫుల్‌షర్ట్‌, లేత గొధుమ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. గుర్తింపు కార్డులు, వస్తువులు లేవని, శవాన్ని రామగుండం ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చు రీలో భద్రపరిచినట్లు చెప్పారు. సంబంధీకులెవరైనా ఉంటే 99493 04574 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.

గుండెపోటుతో రైతు..

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన జెసిబి గన్న బాల్‌రెడ్డి (49) అనే రైతు మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గేదెలు పెంచుతూ ఉపాధి పొందుతున్న బాల్‌రెడ్డి గతేడాది క్రితం గుండెపోటుకు గురయ్యారు. కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయించారు. రెండు రోజుల క్రితం బీపీ తక్కువ కావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో గుండెపోటుకు గురికావడంతో వైద్యులు వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాల్‌రెడ్డికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. రైతు బాల్‌రెడ్డి మృతి తీరని లోటని మండల రైతులు విచారం వ్యక్తం చేశారు.

విండో కార్యదర్శి...

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని ప్రాథమిక సహకార సంఘం కార్యదర్శి మామిడాల అశోక్‌ కుమార్‌(49) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. విధి నిర్వాహణలో ఉండగా అకస్మాత్తుగా అస్వస్థకు గురచ్యాడరు. వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి కరీంనగర్‌ తరలించారు. అక్కడ ప్రైవేటు ఆస్పత్రి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ఆయన ఆకస్మిక మరణంపై సింగిల్‌విండో పాలకవర్గం, సిబ్బంది తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

బాత్‌రూంలో పడి వృద్ధుడు..

జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని సాయిరాంనగర్‌ ప్రాంతానికి చెందిన సంగెం మల్లేశం (78) బాత్‌రూమ్‌లో పడి మృతిచెందాడు. మల్లేశంకు 12 ఏళ్ల క్రితం బైపాస్‌ సర్జరీ అయ్యింది. అప్పటి నుంచి చిన్న కుమారుడి వద్ద ఉంటున్నాడు. మంగళవారం ఉదయం బాత్‌రూమ్‌కు వెళ్లగా ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మల్లేశం భార్య సత్యవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement