గొల్లపల్లి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాసీ్త్రయ పద్ధతులను అనుసరిస్తే మామిడిలో అధిక దిగుబడి, నాణ్యమైన పంట తీయొచ్చని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండలంలోని శ్రీరాములపల్లిలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి మామిడి వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. మామిడి సాగులో ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యానశాఖ నిపుణులు నాణ్యమైన మొక్కల ఎంపిక, శాసీ్త్రయ పద్ధతుల్లో తోటల ఏర్పాటు, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటి యాజమాన్యం, సమతుల్య ఎరువుల వినియోగం, తెగుళ్ల సమగ్ర నివారణ, పంట అనంతర నిర్వహణ, మార్కెటింగ్ అవకాశాలు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వంటి అంశాలపై వివరించారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, నాట్లు, నీటి సంరక్షణ పద్ధతులు, ఉద్యానపంటల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందన్నారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవసాయం, ఉద్యాన రంగాలకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.


