పిలుస్తోంది | - | Sakshi
Sakshi News home page

పిలుస్తోంది

Jul 7 2026 12:27 AM | Updated on Jul 7 2026 12:27 AM

పోలీసు కొలువు పిలుస్తోంది రాష్ట్రవ్యాప్తంగా కానిస్టేబుళ్ల ఖాళీలు

పోలీసు ఉద్యోగాలకు యువత సన్నద్ధం

త్వరలో వెలువడనున్న నోటిఫికేషన్‌

పాతజిల్లాలో వందలాది కానిస్టేబుల్‌ కొలువులు ఖాళీ

సివిల్‌, ఎస్పీఎఫ్‌, ఫైర్‌ పోస్టులపై నిరుద్యోగుల ఆశలు

అప్పుడే సాధన షురూ చేసిన అభ్యర్థులు

ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం

సద్వినియోగం చేసుకోవాలి

పోలీసు కొలువు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

వేలాదిమంది నిరుద్యోగ యువత ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న పోలీసు కొలువులపై డిపార్ట్‌మెంట్‌ తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎస్సై, కానిస్టేబుల్‌ దాదాపు ఏడువేలకుపైగా పోస్టులను గుర్తించింది. ఈ మేరకు పోలీసుశాఖ విడుదల చేసిన ప్రకటన నిరుద్యోగుల్లో ఆశలు పెంచింది. ఇప్పటికే పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆయా జిల్లా యూనిట్ల నుంచి ఏయే పోస్టులు ఖాళీ ఉన్నాయో వివరాలు తెప్పించుకుంది. త్వరలోనే వీటికి నోటిఫికేషన్‌ వేయనుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో పోలీసుశాఖలో చేరాలనుకునే విద్యార్థులు, అభ్యర్థులు అప్పుడే సాధన ప్రారంభించారు.

ఉమ్మడి జిల్లాలో వందలాది పోస్టులు..

వాస్తవానికి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సివిల్‌ విభాగంలో 659 రెగ్యులర్‌ సాంక్షన్డ్‌ పోస్టులు (అన్ని ర్యాంకులు కలిపి) కాగా అందులో ప్రస్తుతం 432 పోస్టులకు సిబ్బంది ఉన్నారు. 227 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఇక ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ (ఏఆర్‌)విభాగంలో 343 సాంక్షన్డ్‌ పోస్టులు ఉంటే 295 మంది పని చేస్తుండగా, 53 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రామగుండం కమిషనరేట్‌ పరిధిలో 1,325 పోస్టులు (అన్ని ర్యాంకులు కలిపి)ఉంటే.. 820 మంది అధికారులు పనిచేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 132 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం సాంక్షన్డ్‌ పోస్టులు 336 కాగా, 242 మంది పనిచేస్తున్నారు. ఇంకా 94 సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులు, ఏఆర్‌ 244 సాంక్షన్డ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు కాగా, 184 కానిస్టేబుల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

సివిల్‌, ఎస్పీఎఫ్‌, ఫైర్‌ పోస్టులకు డిమాండ్‌

ప్రస్తుత నోటిఫికేషన్‌లో సివిల్‌, ఏఆర్‌, ఎస్పీఎఫ్‌, ఫైర్‌ విభాగాల్లో ఎస్సై పోస్టులు ఉన్నప్పటికీ.. అవి పరిమిత సంఖ్యలో ఉండటంతో సహజంగానే కానిస్టేబుల్‌ పోస్టులకు డిమాండ్‌ పెరిగింది. సివిల్‌ (3,697), ఏఆర్‌ (1,052), ఫైర్‌ఫైటర్‌ (751), ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (1,380) ఖాళీలు ఉన్నాయని తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) ప్రకటించడంతో ఈ పోస్టులకు ట్రై చేస్తే వచ్చే అవకాశాలు అధికమని యువత భావిస్తున్నారు. అందుకే, ఆయా విభాగాల ఎస్సై పోస్టులతోపాటు, ఈ పోస్టులకు కూడా గట్టిగా ప్రిపేరవుతున్నారు. ఈ ప్రకటన రాగానే అప్పుడే కోచింగ్‌ సెంటర్లలో సందడి నెలకొంది. ఫిట్‌నెస్‌ పరీక్షల కోసం ఉదయాన్నే లేచి వివిధ గ్రౌండ్లలో ఈవెంట్ల సాధన కూడా ప్రారంభించారు.

ప్రభుత్వం పోలీస్‌ కొలువులకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తుండటం హర్షణీయం. పోలీస్‌ కావాలన్నదే నిరుద్యోగుల కల. అయితే ఉద్యోగం సాధించేందుకు ఇది సువర్ణావకాశం. యూనిఫాం సర్వీసులో చేరాలనుకునే అభ్యర్థులు ప్రణాళికతో చదివితే విజయం సాధించవచ్చు. పట్టుదలతో ముందుకు సాగాలి.

– కొత్త సతీశ్‌రెడ్డి

యూనిఫాం జాబ్‌ కోరుకునే ప్రతీ అభ్యర్థి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రణాళిక బద్ధంగా రాత పరీక్షకు చదువుతూ, అంతకంటే గొప్పగా శారీరక దృఢత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఈవెంట్స్‌ సులభంగా సాధించగలుగుతారు. నిర్దేశిత లక్ష్యం చేరుకుంటారు.

– ఎర్రంశెట్టి మునీందర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement