అందని మాతాశిశు సేవలు | - | Sakshi
Sakshi News home page

అందని మాతాశిశు సేవలు

Mar 20 2026 8:10 AM | Updated on Mar 20 2026 8:10 AM

అందుబాటులోకొస్తే ఎంతో మేలు..

ధర్మపురిలో రూ.10.50 కోట్లతో ఆస్పత్రి పనులు పూర్తయినా చేరని పరికరాలు రెండున్నరేళ్లుగా నిరుపయోగంగా భవనం అందుబాటులోకి వస్తే తల్లీబిడ్డలకు మేలు

మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉంది

ధర్మపురి: ధర్మపురిలోని మాతాశిశు ఆస్పత్రి సేవలకు మోక్షం కలగడం లేదు. గర్భిణులకు మెరుగైన వైద్యం అందాలన్నా.. అప్పుడే పుట్టిన శిశువులకు అవసరమైన చికిత్స అందించాలన్నా.. పరిసర గ్రామాల ప్రజలు అయితే జగిత్యాల.. లేకుంటే కరీంనగర్‌ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో స్థానికంగానే ప్రసూతి, వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 2022 మే నెలలో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.8.50కోట్లు వెచ్చించి 50పడకల మాతాశిశు ఆస్పత్రికి శ్రీకారం చుట్టింది. ఆ నిధులతో పనులు చేపట్టినా.. ఇంకా కొన్ని పనులు పూర్తికాకపోవడంతో రెండో విడత కింద మరో రూ.రెండు కోట్లు వెచ్చించింది. అన్ని నిధులతో సుమారు 90శాతం పనులు పూర్తయ్యాయి.

నాలుగేళ్లుగా సాగుతున్న పనులు

పట్టణంలోని కస్తూరిబా గురుకులం పాఠశాల వెనుక భాగంలో ఈ మాతాశిశు ఆస్పత్రి నిర్మించారు. 2022లో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చేతులమీదుగా నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ 17,735 స్క్వైర్‌ ఫీట్లు, మొదటి అంతస్తు 17000 స్క్వైర్‌ ఫీట్లతో అన్ని సౌకర్యాలతో నిర్మించారు. మొదటి, రెండో అంతస్తులో పనులన్నీ పూర్తయ్యాయి. అయితే కొద్దిపాటి పరికరాలు మాత్రమే వచ్చాయి. వాటితో వైద్యం అందించే వీలు లేకపోవడం.. ప్రభుత్వం మారి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో అప్పటినుంచి ఈ ఆస్పత్రిని పట్టించుకున్న వారు లేరు.

● మాతాశిశు ఆస్పత్రి పనులు పూర్తయిన నేపథ్యంలో సిబ్బందిని నియమిస్తే తల్లీబిడ్డలకెంతో సౌకర్యంగా ఉంటుంది.

● ఆస్పత్రిలో సిబ్బందిని నియమించేందుకు అధికారులు వైద్య విధాన పరిషత్‌కు ప్రతిపాదనలు పంపారు.

● గ్రౌండు ఫ్లోర్‌లో మొత్తం 8 గదులున్నాయి. ఇందులో ఓపి బ్లాక్‌, డెలివరీ గది, ట్రమేజ రూం (డెలివరీ తీవ్రతను నిర్ధారించే గది), మత్తు గది, ఈసీజీ, ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్‌, గైనకాలజిస్ట్‌ గదులు పూర్తయ్యాయి.

● ఫస్ట్‌ఫ్లోర్‌లో మూడు ఆపరేషన్‌ థియేటర్లు నిర్మించారు. ఇందులో ఒకటి సెప్టెక్‌ ఓటీ, రెండు మేజర్‌ ఓటీ గదులు. ఆస్పత్రిలోని 50 బెడ్లలో 40 గర్భిణులు, మిగిలిన పది నవజాత శిశువుల కోసం కేటాయించారు.

● ఆస్పత్రి సిబ్బంది, పరికరాలు, ఫర్నిచర్‌, కాంపౌండ్‌వాల్‌ పూర్తిచేస్తే సేవలు వినియోగంలోకి రానున్నాయి.

● ఆస్పత్రి వినియోగంలోకి వస్తే ధర్మపురి నియోజకవర్గంలోని ఆరు మండలాలతోపాటు జగిత్యాల నియోజకవర్గం పరిధిలోని బీర్‌పూర్‌, సారంగపూర్‌ మండలాలవాసులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

ధర్మపురిలోని ఎంసీహెచ్‌ ఆస్పత్రి పనులను పూర్తి చేసి టీఎస్‌ఎంఐడీసీ వారు అప్పగించారు. తదుపరి వైద్య సిబ్బంది కోసం వైద్య విధాన పరిషత్‌కు నివేదిక పంపించాం. వైద్య సిబ్బంది నియామకమై అందుబాటులోకి రావడానికి మరో రెండు నెలలు పట్టే అవకాశముంది.

– రామకృష్ణ, ఆస్పత్రి సూపరింటెండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement