జగిత్యాల: కేంద్రప్రభుత్వం జనగణనకు నిర్ణయించడంతో ఆ మేరకు జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చార్జ్ సెన్సెస్ అధికారులను నియమించి వారికి శిక్షణ ఇస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో హౌస్‌లిస్టింగ్, ఎన్యుమరేషన్, బ్లాక్స్ నిర్ణయించే అవకాశం ఉంది. ప్రతిఇంటికీ ప్రత్యేకంగా ఓ సంఖ్య కేటాయించనున్నారు. ఇప్పటికే జనగణన కసరత్తులో భాగంగా జిల్లా, డివిజన్, మండలస్థాయిలో చార్జ్ సెన్సెస్ అధికారులను నియమించి కలెక్టరేట్‌లో శిక్షణ కల్పిస్తున్నారు. సెన్సెస్ అధికారిగా అదనపు కలెక్టర్ లత వ్యవహరించనున్నారు. మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజులపాటు హౌస్‌లిస్టింగ్, హౌస్ సెన్సెస్ అధికారులకు శిక్షణ కల్పించారు.
15 ఏళ్లు తర్వాత...
2011లో జనగణన చేశారు. వాస్తవానికి 2021లో జనగణన చేపట్టాల్సి ఉండగా కరోనాతో ఆగిపోయింది. అప్పటి నుంచి అడుగు ముందుకు పడలేదు. జగిత్యాల జిల్లాగా 2016లో ఆవిర్భవించింది. జిల్లాల పునర్విభజన తర్వాత మొదటిసారి జనగణన చేపడుతున్నారు. ఈ లెక్కన జిల్లా గణాంకాలు పూర్తిగా వెలవడనున్నాయి. గతంలోకంటే జనాభా ఇప్పుడు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు రావడం, విద్య, ఉద్యోగాల నిమిత్తం చాలామంది ఇక్కడే నివాసం ఏర్పర్చుకున్నారు.
పూర్తి ఆధారాలతో...
ఈసారి జనగణన డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. మొబైల్ యాప్‌లో సమాచారం నమోదు చేయనున్నారు. ప్రతి ఇంటి కుటుంబ వివరాలు, విద్య, ఉద్యోగం, అన్ని యాప్‌లో నమోదు చేయనున్నారు. మొత్తం రెండు విడతల్లో జనగణన నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
జనగణన ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తొలిదశలో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ అధికారులకు శిక్షణ కల్పించాం. భవిష్యత్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికకు అవసరమైన గణాంకాలు సిద్ధమవుతాయి. – లత, అదనపు కలెక్టర్
మున్సిపాలిటీలు : 5
మండలాలు : 20
రెవెన్యూ గ్రామాలు : 286
గ్రామాలు : 386
మొత్తం జనాభా : 9,83,414
అక్షరాస్యత : 54.53 శాతం


