మృతదేహం కోసం రోడ్డెక్కిన బంధువులు | - | Sakshi
Sakshi News home page

మృతదేహం కోసం రోడ్డెక్కిన బంధువులు

Mar 4 2026 7:47 AM | Updated on Mar 4 2026 7:47 AM

రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రానికి చెందిన వివాహిత బాధనవేణి కావ్య (30) ఫిబ్రవరి 19న ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమెదు చేశారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కావ్య అత్తగారు, తల్లిగారు రుద్రంగి. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట కెనాల్‌ వద్ద మృతదేహం లభించడంతో కావ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహంపై ఉన్న దుస్తుల ఆధారంగా కుటంబ సభ్యులు కావ్యగా గుర్తించారు. అయితే, కావ్య దుస్తులే చూపెట్టారని, మృతదేహాన్ని అప్పగించకుండా ఖననం చేశామని పోలీసులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. మంగళవారం రుద్రంగి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ ఎదుట కోరుట్ల– వేములవాడ ప్రధాన రహదారిపె బైఠాయించారు. మృతదేహాన్ని అప్పగించాలని నిరసన వ్యక్తం చేశారు. కనీసం చివరిచూపు దక్కకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని అప్పగించాలని కావ్య తమ్ముడు, కొడుకులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు మొదటి నుంచి కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేదని ఆరోపించారు. కనీసం మృతదేహాన్ని అప్పగించాలని సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామని రోదిస్తూ వేడుకున్నారు. కావ్య కొడుకులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. కాగా, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు ఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో కావ్యగా నిర్ధారించలేమని, డీఎన్‌ఏ టెస్ట్‌ ఆధారంగా నిర్ధారణకు వస్తామని బాధితులను సముదాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement