ప్రతీ 15 రోజులకోసారి తనిఖీ చేస్తున్నాం
సిరిసిల్ల క్రైం: కార్మికక్షేత్రంలో కల్లు విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. సిరిసిల్ల పట్టణ పరిధితోపాటు చుట్టుపక్కల గ్రామాలలో పెద్దగా తాటి, ఈత వనాలు లేకపోయినా నిత్యం వేలాది లీటర్ల కల్లు మాత్రం విక్రయిస్తున్నారు. పొద్దంతా శ్రమించే నేతకార్మికులు, హమాలీలు, అడ్డాకూలీలు రాత్రి పూట శ్రమను మరిచిపోయేందుకు కల్లును ఆశ్రయిస్తున్నారు. తక్కువ డబ్బులు పెడితే ఒక లీటర్ కల్లు వస్తుందని కార్మికులు, కూలీలు డిపోల వద్దకు పోయి తాగుతుంటారు. వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కల్లు వ్యాపారులు కల్తీకి తెరలేపారు. తీయదనం ఇచ్చే రసాయనంతోపాటు మత్తును ఇచ్చే క్లోరోఫామ్ కలిపి కల్లు తయారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిరిసిల్ల డిపోలలో కల్లు తాగిన వారు ఇంటికి చేరుకునేలోపే మత్తు ఆవహించి రోడ్లపైనే నిద్రపోయే దృశ్యాలు రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిత్యం కనిపిస్తున్నాయి. ఇంతా జరుగుతున్నా ఎకై ్సజ్ అధికారులు మాత్రం తనిఖీలు చేస్తున్నామంటూ కాలం వెల్లదీస్తున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి కల్లు దిగుమతి
సిరిసిల్ల పట్టణానికి జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్, జమ్మికుంట ప్రాంతాల నుంచి మూడు రోజులకోసారి మినీ వ్యాన్లలో కల్లును తీసుకొస్తున్నారు. ఇలా మూడు రోజులకోసారి 800 లీటర్ల అసలు కల్లు వస్తున్నట్లు సమాచారం. ఈ కల్లులో నీరు, ఇతర రసాయనాలు కలిపి నిత్యం సుమారు వెయ్యి లీటర్ల వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది.
అధికారికంగా 4 డిపోలే.. అనధికారికంగా డబుల్
సిరిసిల్లలో అధికారికంగా నాలుగు డిపోల ద్వారా కల్లు విక్రయిస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎనిమిది డిపోలు ఉన్నట్లు సమాచారం. ఒక్కో డిపో కింద నాలుగు నుంచి ఐదు దుకాణాలు ఉన్నాయి. రోజుకు వంద లీటర్ల కల్లుమాత్రమే అమ్ముడుపోతున్నట్లు ఎకై ్సజ్ అధికారులు చెబుతుంటే.. వాస్తవానికి అంతకు ఐదింతలు విక్రయిస్తున్నట్లు సమాచారం. అధికారికంగానే సిరిసిల్లకు జగిత్యాల, పెద్దపల్లి ప్రాంతాల నుంచి కల్లు తీసుకొచ్చేందుకు అనుమతులు ఉన్నాయి. కానీ సుల్తానాబాద్, జమ్మికుంట ప్రాంతాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం.
అధికారుల నిర్లక్ష్యం
ఎప్పటికప్పుడు కల్లు కల్తీ నివారణకు తనిఖీ చేయాల్సిన ఎకై ్సజ్ అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో కార్మిక క్షేత్రంలో కృత్రిమ కల్లు విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతుల జారీతోపాటు పలు ఆరోపణల నేపథ్యంలో గతంలో ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్‌తోపాటు సీఐ స్థాయి అధికారి సస్పెన్షన్ గురైన విషయం తెలిసిందే. ఇప్పటికై నా కార్మిక క్షేత్రంలో కల్తీ కల్లు విక్రయాల నివారణపై అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
కల్తీ మత్తు.. జీవితాలు చిత్తు
సిరిసిల్లలో కనిపించని ఈత, తాటివనాలు
పట్టణంలో విచ్చలవిడిగా కల్లు విక్రయాలు
కృత్రిమ కల్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలు
ఎకై ్సజ్ తనిఖీలపై అనుమానాలు
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
సహజ సిద్ధంగా లభించే కల్లు తాగితే ఎలాంటి నష్టం ఉండదు. కానీ చక్రీన్, క్లోరోఫామ్ కలిపిన కల్లు తాగితే ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. కల్లును ఎక్కువగా కూలీలు, కార్మికులే సేవిస్తుంటారు. ఈ కల్లు తాగిన వారిలో ఎక్కువగా కాలేయ సమస్యలు, కిడ్నీ వ్యాధులు, దృష్టి లోపాలు వంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సిరిసిల్లలో కూలీలు చాలా మంది ఇలాంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు పలువురు వైద్యుల ద్వారా తెలిసింది.
నిబంధనల ప్రకారం ప్రతీ 15 రోజులకోసారి కల్లు డిపోలను నేనే స్వయంగా తనిఖీ చేస్తున్నాను. శాంపిల్స్ తీసి వరంగల్‌లో పరీక్షలు చేయిస్తున్నాం. ఇప్పటి వరకు కృత్రిమ రసాయనాలు వాడినట్లు తేల లేదు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తనిఖీలు సజావుగా సాగుతున్నాయి. మద్యం, కల్లు వ్యాపారం అంటేనే విమర్శలు ఉంటాయి.
– శ్రీనివాస్, ఎకై ్సజ్ సీఐ, సిరిసిల్ల


