ప్రచారం షురూ..! | - | Sakshi
Sakshi News home page

ప్రచారం షురూ..!

Feb 4 2026 7:24 AM | Updated on Feb 4 2026 7:24 AM

ప్రచారం షురూ..!

ప్రచారం షురూ..!

● బీఫామ్‌లు అందించిన అన్ని పార్టీలు ● కదనరంగంలోకి దూకిన అభ్యర్థులు ● గెలుపుపై ఎవరి ధీమా వారిదే..

జగిత్యాల: రెండు రోజులుగా ఉత్కంఠగా ఎదురుచూసిన బీఫామ్‌లు ప్రతి పార్టీకి చెందిన వారికి రావడంతో కార్యాలయాల్లోనూ అందించారు. పార్టీల్లో టికెట్లు రాని వారిలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల, రాయికల్‌ కాంగ్రెస్‌లో అగ్గి రాజుకుంటోంది. మొదటి నుంచి బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను సీనియర్‌ నాయకుడు, మాజీమంత్రి జీవన్‌రెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ మున్సిపల్‌కు సంబంధించిన బీఫామ్‌లో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ వర్గానికే అత్యధికంగా కట్టబెట్టారు. మొదట 30 సీట్లు ఎమ్మెల్యేకు, 20 సీట్లు జీవన్‌రెడ్డికి కేటాయించారు. చివరి సమయంలో జీవన్‌రెడ్డికి సంబంధించిన ఐదుగురిని తొలగించి ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారికే బీఫాంలు అందించారు. దీంతో టికెట్లు రాని వారు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

జీవన్‌రెడ్డి ఇంటి వద్ద ఆందోళన

జీవన్‌రెడ్డి వర్గీయులకు టికెట్లు రాకపోవడంతో ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను అనరాని మాటలతో దూషించారు. తమ కడుపు కొట్టాడని, ఎన్నడూ జెండా ఎగురవేయనివారికి టికెట్‌ అందించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో 30 మంది బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందగా.. ఇందులో చాలామందికి కాంగ్రెస్‌ బీఫాంలు వచ్చాయి. వీరంతా ఎమ్మెల్యే వైపు ఉన్నారు. తినేపళ్లాన్ని లాకున్నారని, ఇది ఎంత వరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. రాయికల్‌లో చాలామంది జీవన్‌రెడ్డి వర్గీయులకు టికెట్లు రాకపోవడంతో పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్‌ అవమానంతో పోటీ నుంచే వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

ఉదయం నుంచి హడావుడి

జీవన్‌రెడ్డి ఇంటి వద్ద ఉదయం నుంచే భారీగా కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జాబితా ప్రకటించడం, అందులో చాలామందికి టికెట్లు రాకపోవడంతో ఉదయం నుంచి జీవన్‌రెడ్డిని కలుస్తున్నారు. అతని ఇంటి ముందే ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై బూతు పురాణాలు వెళ్లగక్కారు. ఒకానొక దశలో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

కన్నీటి పర్యంతం

కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ రాని వారు జీవన్‌రెడ్డి వద్దకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. టికెట్‌ రానప్పటికీ అండగా ఉంటానని జీవన్‌రెడ్డి వారికి సూచించారు. పోటీలో ఉండి గెలుస్తామని సైతం హామీ ఇచ్చారు. ఏదేమైనా అధికార పార్టీ కాంగ్రెస్‌లో బహిరంగంగానే వివాదాలకు దారితీస్తోంది. ఈ వివాదం ఎన్నికల్లో ఎటు వైపు దారితీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

బీజేపీలో కూడా..

బీజేపీలోనూ అసంతృప్తి నెలకొంది. 26వ వార్డులో బీజేపీ నుంచి సిట్టింగ్‌ కౌన్సిలర్‌ పులి రమ నామినేషన్‌ దాఖలు చేయగా బీఫాం ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే 22వ వార్డులో అర్వ లక్ష్మీ బీజేపీ నుంచి నామినేషన్‌ దాఖలు చేయగా టికెట్‌ రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగంగానే ఎంపీ అర్వింద్‌పై విమర్శలు చేశారు.

రెబల్‌ గుబులు

పార్టీల్లో టికెట్లు రాకపోవడంతో చాలా మంది స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. జీవన్‌రెడ్డి వర్గీయులు, ఇటు ఎమ్మెల్యే వర్గీయులు తలపడుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరిద్దరు పోటీ చేస్తుండడంతో అవకాశాన్ని ఎలాగైనా అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్‌ఎస్‌, బీజేపీలు చూస్తున్నాయి.

చైర్మన్‌ పదవి కోసం పావులు

జగిత్యాల చైర్మన్‌ పీఠాన్ని ఎలాగైనా అందుకోవాలని కాంగ్రెస్‌ చూస్తోంది. గతంలో చైర్మన్‌గా పనిచేసిన అడువాల జ్యోతి పదవిని ఆశిస్తున్నారు. అదే సమయంలో గతంలో ఒక్క ఓటుతో ఓడిపోయిన సమిండ్ల వాణి కూడా చైర్మన్‌ పదవి కోసం పోటీపడుతున్నారు. తాజాగా లైబ్రరీ మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌గౌడ్‌ సతీమణి గొల్లపల్లి మాధవీలత చైర్మన్‌ పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇందులో మొదట ప్రకటించిన కాంగ్రెస్‌ జాబితాలో మాధవిలత పేరు లేదు. ఆ స్థానంలో వీరబత్తిని పద్మజ ఉండేది. వీరంతా చివరి నిమిషంలో బీఫాం సాధించారు. చైర్మన్‌ పదవి ఆశిస్తున్న ఓ సభ్యుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం కోసం నజరానా సైతం ప్రకటించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కానీ అనుకూలించకపోవడంతో పోటీలో దిగినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement