వారే వీరు..గుర్తులే తారుమారు | - | Sakshi
Sakshi News home page

వారే వీరు..గుర్తులే తారుమారు

Feb 5 2026 7:28 AM | Updated on Feb 5 2026 7:28 AM

వారే వీరు..గుర్తులే తారుమారు

వారే వీరు..గుర్తులే తారుమారు

నాడు కారు గుర్తుపై విజయం.. నేడు చేతి గుర్తుపై బరిలో.. 30 స్థానాల్లో పాత కాపులే గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందుకు జీవన్‌రెడ్డి వర్గానికి దక్కిన సీట్లు 15 మాత్రమే చక్రం తిప్పిన ఎమ్మెల్యే సంజయ్‌ తన వర్గంలోని 35 మందికి టికెట్లు

జగిత్యాల బల్దియాలో వింత పరిస్థితి

జగిత్యాల: జిల్లాలో ప్రచార సమరం ప్రారంభమైంది. నామినేషన్ల ఉపసంహరణ ముగియడం.. బీఫామ్‌ల లొల్లి కూడా కొలిక్కి రావడంతో టికెట్లు వచ్చిన అభ్యర్థులు కదనరంగంలోకి దిగారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల్లో రెబల్స్‌ ప్రభావం పెద్దగా లేదు. కానీ.. జగిత్యాలలో మాత్రం వింత పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం 50 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్‌ నుంచి అటు జీవన్‌రెడ్డి, ఇటు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ వర్గీయులు అన్ని స్థానాలకు నామినేషన్లు వేశారు. అయితే వీరిలో సంజయ్‌ వర్గంలోని 35 మందికి బీఫామ్‌లు దక్కాయి. జీవన్‌రెడ్డి వర్గంలోని 15 మందికి మాత్రమే బీఫామ్‌లు లభించాయి. అయితే సంజయ్‌ వర్గం నుంచి బరిలో ఉన్నవారంతా తాజా మాజీ కౌన్సిలర్లు కావడం విశేషం. 35 మందిలో 30 మంది గతంలో బీఆర్‌ఎస్‌ నుంచి విజయం సాధించారు. సంజయ్‌ కుమార్‌ కూడా ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌ నుంచే గెలిచినప్పటికీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని ప్రకటిస్తున్నారు. ఆయన బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు వెంట నడిచిన వారు ప్రస్తుతం కూడా ఆయనతోనే ఉన్నారు. తాజాగా వారికే కాంగ్రెస్‌ నుంచి టికెట్లు కూడా లభించాయి. పాతకాపులే పోటీ చేస్తున్నా.. కేవలం పార్టీ గుర్తులు మాత్రం మారాయి.

ఇరువర్గాల మధ్య పోటీ తీవ్రం..

ఎమ్మెల్యే వర్గీయులకు అత్యధికంగా టికెట్లు రావడం.. జీవన్‌రెడ్డి వర్గీయులు ఒక్కరు కూడా విత్‌డ్రా చేసుకోకపోవడంతో పోటీ తీవ్రమైంది. ప్రధాన పార్టీల మధ్య పోరు ఉండాల్సింది పోయి కాంగ్రెస్‌ రెబల్స్‌ మధ్యనే పోటీ నెలకొంది. మున్సిపాలిటీని సునాయాసంగా కాంగ్రెస్‌ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ బీఫామ్‌ల గొడవతో ఏ పార్టీ గెలుస్తుందోనని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన వారంతా ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తుండడంతో ఆ పార్టీ కాస్త ఢీలా పడినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత కాంగ్రెస్‌ గొడవను క్యాచ్‌ చేసుకుని బల్దియాను ఎలాగైనా కై వసం చేసుకోవాలని పావులు కదుపుతున్నారు. ఆచీతూచి వ్యవహరిస్తూ.. కాంగ్రెస్‌ ఎక్కడెక్కడ వీక్‌ ఉందో చూసుకుంటూ ముందుకెళ్తున్నారు. బీజేపీ కూడా బల్దియాలో పాగా వేసేందుకు ప్రచారంలోకి దిగింది.

ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ..

బీఆర్‌ఎస్‌ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం చేస్తోంది. బీఆర్‌ఎస్‌ హయాంలోనే జగిత్యాల జిల్లా అయ్యిందని, మెడికల్‌ కళాశాల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధి వంటి అంశాలను చెప్పుకుంటూనే కాంగ్రెస్‌ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రచారం చేస్తోంది.

కాంగ్రెస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌

జిల్లాలో జగిత్యాలే అతిపెద్ద మున్సిపాలిటీ. ఇక్కడ 50 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డులకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలో నిలిపాయి. కాంగ్రెస్‌ మినహా ఏ పార్టీలోనూ రెబల్‌ లేరు. ఒక్క కాంగ్రెస్‌లోనే రెబెల్స్‌ మోగిస్తున్నారు. జీవన్‌రెడ్డి వర్గీయులకు టికెట్లు రాకపోవడంతో బరిలో ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ జెండా మోసిన వారికే తన మద్దతు అని జీవన్‌రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఆయన చరిష్మాతో విజయం సాధిస్తామని, కాంగ్రెస్‌ జెండామోయకున్నా..టికెట్‌ దక్కించుకున్న వారిని ఓడిస్తామని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని, బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని చెబుతూ అనుకూలమైన వారందరికీ ప్రచారం చేస్తానని ప్రకటిస్తూ.. కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. దీంతో ఇక్కడ ఎమ్మెల్యే వర్సెస్‌ జీవన్‌రెడ్డి పోటీగా మారింది.

మొగ్గు ఎటువైపో..?

ఎమ్మెల్యే సంజయ్‌ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానంటూ.. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానంటూ.. గతంలో బీఆర్‌ఎస్‌లో ఉన్నవారికి ప్రస్తుతం కాంగ్రెస్‌ తరఫున టికెట్లు ఇప్పించుకున్నారు. వీరు కూడా కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు జీవన్‌రెడ్డి వర్గం తామే అసలైన కాంగ్రెస్‌వాదులమని, తమను గెలిపించి పార్టీకి పూర్వ వైభవం తేవాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దీంతో ఇక్కడ ఎన్నికల సమరం రసవత్తరంగా నడుస్తోంది.

అభివృద్ధి మంత్రంతో అధికార పార్టీ..

జిల్లాలోని మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు అధికార పార్టీ అన్నిదారులు వెతుకుతోంది. ఉచిత కరెంట్‌, మహాలక్ష్మీ వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ గెలిపించాలని కోరుతోంది. బీజేపీ కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement