ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ముందుగా గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు.
మల్లాపూర్‌లో హనుమాన్ పల్లకీ సేవ
మల్లాపూర్ :మండలకేంద్రంలో బుధవారం హనుమాన్ పల్లకీ సేవను ఘనంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో తరలివచ్చారు. స్థానిక హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. హనుమాన్ దీక్షాపరులు జై శ్రీరామ్.. జైజై శ్రీరామ్ నినాదాలతో పల్లకీసేవలో పాల్గొన్నారు. సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉపసర్పంచ్ గడ్డం సోమరెడ్డి, హనుమాన్ దీక్షాపరులు కళ్లెం మహిపాల్‌రెడ్డి, కాసారపు భూమారెడ్డి, చింతలూరి రంజిత్, లవంగ శివకుమార్, వార్డుసభ్యులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
గాలికుంటూ నివారణ టీకాలు వేయించాలి
మెట్‌పల్లిరూరల్: పశువులకు గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి ప్రకాశ్ అన్నారు. మెట్‌పల్లి మండలం చౌలమద్దిలో టీకాల కార్యక్రమాన్ని బుధవారం తనిఖీ చేశారు. అనంతరం ప్రాథమిక పశువైద్య కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. రైతులతో సమావేశమై గాలికుంటూ లక్షణాలు, నష్టాలు వివరించారు. వ్యాధి సోకిన పశువులకు తీవ్రమైన జ్వరం వచ్చి నీరసించిపోతాయని, బొబ్బలు ఏర్పడి పుండ్లుగా మారుతాయని పేర్కొన్నారు. పాల ఉత్పత్తి తగ్గి నష్టం వాటిల్లుతుందని వివరించారు. ఆయన వెంట మెట్‌పల్లి మండల పశువైద్యాధికారి కొమ్మెర మనీషాపటేల్, ఉపసర్పంచ్ రాజేశ్వర్‌రెడ్డి, సిబ్బంది రమణయ్య, చిరంజన్, దిలీప్, రైతులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లకు సంసిద్ధం కావాలి
జగిత్యాల: ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం కావాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. బుధవారం అధికారులతో సమావేశమయ్యారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, 48 గంటల్లోనే డబ్బులు అందేలా చూడాలని ఆదేశించారు. ఈసారి రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. డీఏవో భాస్కర్, పౌరసరఫరాల శాఖ మేనేజర్ జితేంద్రప్రసాద్ పాల్గొన్నారు.


