దుబాయిలో గుండెపోటుతో సిరికొండ వాసి మృతి
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన ముంజ స్కైలాబ్‌గౌడ్(45) అనే వ్యక్తి దుబాయిలో గుండెపోటుతో మృతిచెందినట్లు గ్రామస్తులు మంగళవారం తెలిపారు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... స్కైలాబ్‌గౌడ్ గత పదేళ్లుగా దుబాయిలోని అబుదాబి ఏరియాలో ముసాయిదా క్యాంపులో కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఈ నెల 26న తాను ఉంటున్న క్యాంపులోనే గుండెపోటు రావడంతో తోటి మిత్రులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందినట్లు అక్కడివారు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతదేహాం స్వగ్రామానికి పంపించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.


