సజ్జ సాగువైపు రైతుల చూపు
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల జిల్లాలో చాలాప్రాంతాల్లో నువ్వు, మొక్కజొన్న, పెసర, కంది పంటలకు ప్రత్యామ్నాయంగా సజ్జ పంటను సాగు చేస్తూ రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. పంటను విక్రయించేందుకు ప్రైవేట్ కంపెనీలతో నేరుగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. పంటకు అవసరమైన వాతావరణ పరిస్థితులు జిల్లాలో ఉండటంతో విత్తనోత్పత్తిగా పలు కార్పొరేట్ కంపెనీలు ఉత్పత్తి చేయిస్తున్నాయి.
ధరలు ఆశాజనకంగా ఉండటంతో..
ప్రైవేట్ కంపెనీలు విత్తనోత్పత్తి చేసిన రైతులకు క్వింటాల్‌కు రూ.6,450 నుంచి రూ.8,500 వరకు (విత్తనరకాన్ని బట్టి) చెల్లిస్తున్నాయి. కంపెనీలే విత్తనాలు ఇవ్వడం, పంట పండిన తర్వాత బై బ్యాక్ పద్ధతిలో కొనుగోలు చేయడం రైతులకు కలిసివస్తోంది. జిల్లాలో అనువైన వాతావరణ పరిస్థితులు ఉండటంతో ప్రైవేట్ కంపెనీలు ఇప్పటివరకు వరి, ఆవాల పంటలో విత్తనోత్పత్తి చేయించగా.. తాజాగా సజ్జ పంటలోనూ చేయిస్తున్నాయి. అలాగే రైతులు ఎక్కువగా సాగు చేసే వరి, మొక్కజొన్న, పత్తి, కంది, పెసర వంటి పంటలకే ప్రభుత్వ మద్దతు ధర ఉండగా.. మిగతా పంటలకు ప్రభుత్వ మద్దతు ధర లేదు. దీంతో రైతులు ఏదైనా కొత్త పంట సాగు చేస్తే ఆయా పంట ఉత్పత్తులు మార్కెట్‌కు వచ్చేవరకు ఏ ధర ఉంటుందో తెలియని పరిస్థితి. పంటకు ముందే ఫలానా ధర చెల్లిస్తామని కంపెనీలు ముందుకు రావడంతో రైతులు సజ్జ పంట వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణంగా మారింది. దీనికితోడు, తక్కువ కాలంలో పెద్దగా ఖర్చు లేకుండా పంట చేతికి అందుతుండటంతో రైతులు సజ్జవైపు దృష్టి పెడుతున్నారు.
15 వేలు ఎకరాల్లో ఆవాల సాగు
జిల్లాలోని మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, కథలాపూర్ ప్రాంతాల్లో ఎక్కువగా.. జగిత్యాల, మేడిపల్లి, రాయికల్ ప్రాంతాల్లో ఓ మోస్తరుగా సజ్జ పంటను సాగు చేశారు. జిల్లా మొత్తంగా దాదాపు 15వేల ఎకరాల్లో సజ్జను సాగు చేశారు. జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో మొక్కజొన్న, వేరుశెనగ వంటి పంటలు వేస్తే అడవి పందులు, కోతులు, రామచిలుకలు తీవ్ర నష్టం చేస్తున్నాయి. వీటికి ప్రత్యామ్నాయ పంటగా రైతులు సజ్జ పంటను సాగు చేస్తున్నారు. ఐదారు నీటి తడులు ఇస్తే సరిపోతుండటం.. ఎరువులు వేయాల్సిన అవసరం పెద్దగా లేకపోవడం.. పంట 85–90 రోజుల్లోనే చేతికి వస్తుండటంతో రైతులు మొగ్గుచూపుతున్నారు. రైతులు ఎక్కువగా వానకాలంలో పసుపు, మొక్కజొన్న సాగు చేసిన తోటలతోపాటు తేమ ఎక్కువగా లేని పొలాల్లో సజ్జ సాగు చేస్తున్నారు.
ప్రైవేట్ కంపెనీల విత్తనాలు
ప్రైవేట్ కంపెనీలే విత్తనాలు కిలోకు రూ.800 చొప్పున సరఫరా చేస్తున్నాయి. ఎకరాకు కిలో విత్తనాలు సరిపోతాయి. ఆడ, మగ విత్తనాలు ఇస్తారు. విత్తనోత్పత్తి కింద సాగు చేసిన రకాల్లో ఎకరాకు 10 నుంచి 14 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. దిగుబడి బాగా వస్తే ఎకరాకు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి పంటను సీడ్ కంపెనీలు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు సరఫరా చేస్తాయి. అక్కడి పాడి గేదెలకు గ్రాసంగా ఉపయోగిస్తున్నారు. ఏదై గ్రామంలో 50 శాతం మంది రైతులకు 10 క్వింటాళ్ల కంటే తక్కువ దిగుబడి వచ్చినప్పటికి, 10 క్వింటాళ్ల వరకు రేటు చెల్లిస్తారు. 10 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తే ఆ మేరకు రేటు చెల్లిస్తారు.
పంట కొనుగోలుకు కంపెనీలు ఒప్పందం
ఇక్కడ పండిన పంట ఉత్తరాది రాష్ట్రాలకు సరఫరా
జిల్లాలో 15 వేల ఎకరాల్లో సాగు


