పల్లెల్లో ‘పంచాయితీ’
కరీంనగర్‌రూరల్: కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై గ్రామాల్లో వివాదాలు ఏర్పడుతున్నాయి. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేస్తుండగా, తాము ఖర్చు పెట్టిన బిల్లులకు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు. నిబంధనల ప్రకారం నిధులు ఉపయోగించాలని కొత్త సర్పంచులు సూచిస్తుండడంతో నిధుల వినియోగంపై అయోమయం నెలకొంది. 2024 ఫిబ్రవరిలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో అప్పటి నుంచి పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర నిధులు నిలిచిపోయాయి. ఇటీవల పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో దాదాపు రెండేళ్ల అనంతరం జిల్లాకు రూ.5,12,57,717 విడుదల కాగా త్వరలో గ్రామపంచాయతీల ఖాతాల్లో జమచేయనున్నారు.
నిధుల వినియోగంపై వివాదం
కేంద్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తోంది. జనాభా ప్రాతిపదికన గ్రామంలోని ప్రతీ వ్యక్తికి నెలకు రూ. 80 నుంచి రూ.90 చొప్పున మూడు నెలలకోసారి నిధులు మంజూరవుతాయి. 18నెలలుగా పాలకవర్గాలు లేకపోవడంతో నిధులు విడుదల కాలేదు. జిల్లాలో గతంలో పాలకవర్గాలుండగా 7 మండలాల్లోని గ్రామపంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు మొదటి విడత మంజూరు కాగా ప్రస్తుతం కొత్తపల్లి, మానకొండూరు, రామడుగు, శంకరపట్నం, తిమ్మాపూర్, సైదాపూర్, వీణవంక మండలాల్లోని పంచాయతీలకు రూ.5,12,57,717 మంజూరయ్యాయి. ప్రస్తుతం మంజూరైన నిధులు 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి కావడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచులు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే 2023 ఫిబ్రవరి 1నుంచి పాలకవర్గాలు లేకపోవడంతో అప్పులు చేసి గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించామని తమకే బిల్లులు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శులు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్న పంచాయతీల్లో రూ.2లక్షల వరకు, పెద్ద పంచాయతీల్లో రూ.4 లక్షల వరకు ఖర్చు పెట్టామని, తమ జీతాలను సైతం వినియోగించామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు గ్రామాభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలని కొత్త సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. మాజీ సర్పంచుల బిల్లుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. కాగా గతంలో ఉన్న కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన గైడ్‌లైన్స్ ప్రకారం నిధులు వినియోగించాలని జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.
15వ ఆర్థిక సంఘం నిధులపై వివాదం
పాత బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచుల డిమాండ్
అభివృద్ధి పనులకు వినియోగిస్తా మంటున్న కొత్త సర్పంచులు
పల్లెల్లో ‘పంచాయితీ’


