విషజ్వరంతో వ్యక్తి మృతి
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బోయిని రాములు(34) వారం రోజులుగా విషజ్వరంతో బాధపడుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలు. రాములు వారం రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతూ స్థానికంగా ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స పొందాడు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ప్లేట్‌లెట్స్ 25వేలకు పడిపోయినట్లు తెలిసింది. వారం రోజులుగా జ్వరం తగ్గక వ్యక్తి ప్రాణాలు పోవడంతో గ్రామస్తులు డెంగీ జ్వరం కావచ్చని భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వైద్యాధికారులు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై డీఐవో సంపత్‌కుమార్‌ను వివరణ కోరగా రుద్రంగిలో వ్యక్తి మృతికి గల కారణాలను తెలుసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశిస్తామన్నారు.
ఉరేసుకుని యువకుని ఆత్మహత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): అప్పుల బాధ భరించలేక.. ఇంట్లో జరుగుతున్న గొడవలకు మనస్తాపం చెంది ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం కొండాపూర్‌కు చెందిన ఎక్కల్‌దేవి కుమార్(32) ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లివచ్చిన కుమార్ తండ్రి దేవయ్యతో కలిసి వ్యవసాయం పనులు చేస్తున్నాడు. ఇటీవల కొత్తింటిని నిర్మించేందుకు అప్పులు చేశారు. దీంతో కుమార్‌కు భార్య కావ్యకు మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం కూడా ఇద్దరి మధ్య గొడవలు జరగగా, ఆగ్రహానికి గురైన కుమార్ భార్య కావ్యపై చేయిచేసుకున్నాడు. అప్పుల బాధలు, భార్యను కొట్టిన అనే మనస్తాపానికి గురైన కుమార్ ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమార్ ఆత్మహత్యతో భార్య, కుమారుడు, కూతురు, తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుని తండ్రి దేవయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
విషజ్వరంతో వ్యక్తి మృతి


