కోరుట్ల బల్దియాపై బీజేపీ జెండా ఎగరేద్దాం
కోరుట్ల: కోరుట్ల మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. పట్టణానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు అనూప్‌రావు సహ పలువురు నాయకులు శుక్రవారం బీజేపీలో చేరగా, పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరడంతో కోరుట్లలో పార్టీకి బలం మరింత పెరిగిందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, అలాగే ఎంపీ అరవింద్ కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మచ్చ శేఖర్, అల్లాడి ప్రవీణ్, తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్, రేగుంట మహీంద్ర బీజేపీలో చేరారు. రాష్ట్ర నాయకురాలు బోగ శ్రావణి, చిట్నేని రఘు, రశ్రీనివాస్, నరేందర్‌రెడ్డి, స్వీతీ అనూప్, రుద్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


