నకిలీ ఎరువులు ఇచ్చారని ఆందోళన
ముస్తాబాద్(సిరిసిల్ల): ఆరుగాలం కష్టపడి నాటువేసిన వరిపంటలో ఎదుగుదల లేదని.. నకిలీ ఎరువులతోనే పంటను నష్టపోతున్నామని ఆరోపిస్తూ ఫర్టిలైజర్ దుకాణం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్‌లో శ్రీలక్ష్మీ ఫర్టిలైజర్ ఎదుట కొండాపూర్, ఆవునూర్ రైతులు సోమవారం ధర్నా చేశారు. రైతులు మాట్లాడుతూ నలభై రోజుల క్రితం 200లకు పైగా దుక్కి బస్తాలను కొనుగోలు చేశామన్నారు. వరినాటుకు ముందు పొలంలో దుక్కి చల్లామని, నెలరోజులైనా వరి ఎదుగలేదని రాకేశ్‌రెడ్డి, నిమ్మ రాజిరెడ్డి, దేవిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాజు, కిషన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో బస్తాను రూ.1350కి కొనుగోలు చేశామన్నారు. తమ రెక్కల కష్టం పోయిందని, పంటనష్టంతో ఎకరానికి రూ.50వేల నష్టం జరిగిందన్నారు. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో మండల వ్యవసాయాధికారి అనూష, ఎస్సై గణేశ్ ఆవునూర్ చేరుకుని రైతులను శాంతింపజేశారు. నాసిరకం ఎరువులు అమ్మడంతోనే తమకు నష్టం జరిగిందని రైతులు తెలిపారు. ఎరువును ల్యాబ్‌కు పంపించి పరీక్షిస్తామని, నకిలీ అని తేలితే చర్యలు తీసుకుంటామని ఏవో హామీ ఇచ్చారు. రైతుల ఆందోళనతో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం ఆవునూర్‌లో విచారణ చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపిస్తామని చెప్పారు. కాగా ఫర్టిలైజర్ దుకాణం డీలర్ ఒక్కో రైతుకు రూ.800 చొప్పున చెల్లించడంతో రైతులు వెనుదిరిగారు.
ఆవునూర్‌లో విచారణ చేపట్టిన అధికారులు
షాప్‌లో విక్రయాలు నిలిపివేయాలని ఆదేశం
నకిలీ ఎరువులు ఇచ్చారని ఆందోళన


