కోరుట్ల పీఠం మళ్లీ మహిళకే..
కోరుట్ల: కోరుట్ల మున్సిపల్ చైర్మన్ పదవి మరోసారి మహిళకు రిజర్వ్ కావడంతో ఆ స్థానానికి పోటాపోటీగా ప్రయత్నాలు సాగిస్తున్న నేతల ఆశలు సన్నగిల్లాయి. కోరుట్ల చైర్మన్ స్థానం గతంలో బీసీ మహిళకు ఉండటంతో ఆ సమయంలో చైర్మన్‌గా అన్నం లావణ్య కొనసాగారు. ఈసారి మార్పు జరుగుతుందని భావించినా.. మళ్లీ జనరల్ మహిళకు ఖరారు కావడం ఆశావహులను నిరుత్సాహపర్చింది.
కాంగ్రెస్‌లో పోటాపోటీ..
ఈసారి చైర్మన్ పదవి జనరల్ అవుతుందని ఆశించిన కాంగ్రెస్‌లోని ఆశావహులను నిరాశ పర్చింది. జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో చైర్మన్ పదవిపై కన్నేసిన నలుగురు కాంగ్రెస్ నాయకులు తమ సతీమణలను బరిలోకి దించాల్సిన పరిస్థితి నెలకొంది. చైర్మన్ స్థానం దక్కించుకునేందుకు ఒకరిద్దరు తాము పోటీ చేస్తున్న వార్డులను మార్చుకుని పక్కనే ఉన్న మరోవార్డుల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
బీఆర్‌ఎస్ యత్నాలు..
గతంలో కౌన్సిలర్‌గా కొనసాగిన మహిళను చైర్‌పర్సన్ చేసేందుకు ఆ పార్టీ నాయకులు పావులుకదుపుతున్నట్లు సమాచారం. పట్టణంలోని 33 వార్డుల్లో తమ పట్టు ఉందని, మెజార్టీ వార్డులు గెలుచుకుంటామని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గతంలో బీఆర్‌ఎస్‌లో ఉన్న కీలక నాయకులు అందరూ కాంగ్రెస్‌లోకి చేరడంతో మళ్లీ చైర్‌పర్సన్ అభ్యర్థిని ఖరారు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా చైర్మన్ రిజర్వేషన్ ఆ పదవి కోసం ఆశిస్తున్న పురుష అభ్యర్థులకు భంగపాటుగా మారింది.


