బాధితులకు అండగా ప్రజా ప్రభుత్వం
మల్యాల(చొప్పదండి): కొండగట్టు అగ్నిప్రమాద బాధితులకు ప్రజా ప్రభుత్వం అండగా నిలిచిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. బాధితులకు సీఎం సహాయ నిధి నుంచి రూ.83,12,000, విద్యుత్ సంస్థ నుంచి రూ.29లక్షలు, డీఆర్‌డీవో ద్వారా రూ.10లక్షలు మంజూరయ్యాయి. సదరు చెక్కులను మంత్రి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ బి.సత్యప్రసాద్ శుక్రవారం బాధితులకు అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అగ్నిప్రమాదంలో దుకాణాలు కాలిపోవడంతో బాధితుల రోదలనతో గుండెలు ద్రవించాయని, తక్షణమే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆర్థికసాయం అందించారని వివరించారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి సలహాలు, సూచనలతో బాధితులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదంలో పోగొట్టుకున్న విద్యార్థుల సర్టిఫికెట్ల మంజూరుకు కృషి చే యాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ, చొప్పదండి నియోజకవర్గమే తన కుటుంబమని, ఎవరికి ఆపద వచ్చినా సాయం అందిస్తున్నానని తెలిపారు. అగ్ని ప్రమాదంలో కా లిపోయిన దుకాణాలను యథాస్థితికి తీసుకువచ్చే వరకు అండగా నిలుస్తామన్నారు. మాజీ సీఎం కొండగట్టు ఆలయానికి రెండుసార్లు వచ్చినా న యాపైసా విడుదల చేయలేదన్నారు. ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీవో రఘువరన్, ఎస్‌ఈ సుదర్శన్, డీఈఈ గంగారాం, తహసీల్దార్ వసంత, ఎంపీడీవో స్వాతి, సర్పంచ్ ఆదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


