‘జగిత్యాలలో అగ్రవర్ణాల ఆధిపత్యం’
జగిత్యాలటౌన్: జగిత్యాలలో కొన్ని దశాబ్దాలుగా అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతుందని, జిల్లావ్యాప్తంగా వెలమ దొరల రాజ్యం నడుస్తుందని ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ అన్నారు. లక్ష కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న ఆయన శుక్రవారం జగిత్యాల పట్టణంలో నాయీబ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో వెలమ, రెడ్లకు తప్ప బడుగు, బలహీన వర్గాలకు అధికారం అందనంత దూరంలో ఉందన్నారు. బలహీనవర్గాలు అధికారంలోకి వచ్చినా వారు అగ్రవర్ణాల కిందే పనిచేయాల్సి వస్తుందన్నారు. బడుగు, బలహీనవర్గాల ఓట్లు అధికంగా ఉన్నా అధికారం మాత్రం అగ్రవర్ణాల చేతుల్లో ఉండటం దురదృష్టకరమన్నారు. చైనా లాంటి దేశాల్లో మహిళలు కంప్యూటర్లు తయారు చేస్తుంటే మన దగ్గర మహిళలు ఇంకా బీడీలు చుడుతూ రోగాలబారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బలహీనవర్గాల వారందరూ ఏకమై రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మానాల కిషన్, నాయకులు పడాల శ్రీనివాస్, గొల్లపల్లి శ్రీకాంత్‌గౌడ్, శివ, ఆస్రఫ్ తదితరులు పాల్గొన్నారు.


