కాంగ్రెస్ నిరసనలు సిగ్గుచేటు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు
జగిత్యాలటౌన్: ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ కాంగ్రెస్ చేస్తున్న నిరసనలు సిగ్గు చేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేందుకు నిలదీయాలని కోరారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకే గతంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అత్యధికసార్లు సవరించింది కాంగ్రెస్ పార్టీ కాదా..? అని నిలదీశారు. ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లకు ఇందిరమ్మ పేరు ఎందుకని, ఇళ్లకు ఇందిరమ్మకు ఏం సంబంధమని ప్రశ్నించారు. కేంద్రం చట్టబద్ధంగా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి మెజారిటీ ఎంపీల మద్దతుతో పథకం విధివిదానాలతోపాటు పేరు మార్చిందన్నారు. జుంబర్తి దివాకర్, తుకారాంగౌడ్, సాంబారి కళావతి, మరిపెల్లి సత్యం, ఆముద రాజు, సిరికొండ రాజన్న, కడార్ల లావణ్య ఉన్నారు.
బీజేపీ అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా కృషి చేయాలి
మెట్‌పల్లి: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చిట్నేని రఘు, జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు సూచించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేశ్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్ గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో బీజేపీ ఓటు బ్యాంకు 49శాతానికి పెరిగిందన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్‌ఎస్‌కు బీజేపీ గట్టి పోటీని ఇవ్వడం ఇక్కడ పార్టీకి ఉన్న బలాన్ని స్పష్టం చేస్తుందన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెపల్లి శ్రీనివాస్, నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు దొనికెల నవీన్, ఎర్ర లక్ష్మీ, పీసు రాజేందర్, సుంకేట విజయ్, కుడుకల రఘు తదితరులున్నారు.


