భవితకు బంగారు బాట
కోనరావుపేట(వేములవాడ): గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు వృత్తి శిక్షణ ఇచ్చి, ఉపాధి చూపుతుంది జీఎమ్మార్ వరలక్ష్మి ఫౌండేషన్. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారంలో ఏర్పాటు చేసిన జీఎమ్మార్ వరలక్ష్మి ఫౌండేషన్ నిరుద్యోగ యువతకు వరంగా మారింది. వివిధ వృత్తిపరమైన శిక్షణ పొందుతూ యువకులు పక్కా ఉపాధి పొందుతున్నారు.
ఎనిమిదేళ్లుగా సేవలు
కోనరావుపేట మండలం నాగారంలో ప్రతిమ ఫౌండేషన్, జీఎమ్మార్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సహకారంతో జీఎమ్మార్ వరలక్ష్మి ఉపాధి శిక్షణ కేంద్రాన్ని 2017 సెప్టెంబర్ 2న ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర అప్పటి గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు, మై హోమ్ రామేశ్వర్‌రావు ప్రారంబించారు.
భవిష్యత్‌పై భరోసా
నాగారంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రంలో మహిళలకు నర్సింగ్, బెడ్‌సైడ్, టైలరింగ్, హోమ్‌సైడ్ వర్క్, యువకులకు బైక్ రిపేర్, సోలార్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు. వీటితోపాటు ఉత్తమ శిక్షణ, యోగా, క్రీడలు, కంప్యూటర్ శిక్షణ, వ్యక్తిత్వ వికాస తరగతులు, స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు కూడా అదనంగా నేర్పిస్తున్నారు. శిక్షణకాలంలో ఉచిత భోజన సదుపాయం, వసతి కల్పిస్తున్నారు. రోజూ వచ్చి వెళ్లే వారికి ట్రావెలింగ్ చార్జీలు సైతం చెల్లిస్తున్నారు.
1350 మందికి ఉపాధి
2017 నుంచి ఇప్పటి వరకు సుమారు 1,520 మందికి శిక్షణ ఇచ్చారు. ఒక్కో బ్యాచ్‌కు 20 నుంచి 30 మందిని చేర్చుకుంటున్నారు. 1520 మందికి ఇప్పటి వరకు 1,320 మందికి ఉపాధి కల్పించారు. శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఎలక్ట్రికల్‌లో శిక్షణ పొందాను
మాది కోనరావుపేట మండలం నాగారం. మా గ్రామంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రంలో ఎలక్ట్రికల్‌లో రెండు నెలలు శిక్షణ పొందాను. అన్ని రకాల అంశాలపై తర్పీదునిచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రీషియన్‌గా ఉపాధి పొందుతున్నాను.
– బాస అజయ్, నాగారం(కోనరావుపేట)
స్వయం ఉపాధికి మార్గం
నేను కుట్టు, అల్లికలపై రెండు నెలలు శిక్షణ తీసుకున్నాను. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ అందించారు. ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటూ కుట్టు మిషన్ నడుపుతున్నాను. స్వయం ఉపాధి పొందుతున్నాను. నాగారంలో అందిస్తున్న శిక్షణ యువతులకు చాలా ఉపయోగకరంగా ఉంది.
– శ్రావణి, వేములవాడ
యువకుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న జీఎమ్మార్
శిక్షణ ఇచ్చి ఉపాధి చూపుతున్న సంస్థ
నాగారంలో ఎనిమిదేళ్లుగా సేవలు
భవితకు బంగారు బాట
భవితకు బంగారు బాట
భవితకు బంగారు బాట


