టెన్‌షన్ వద్దు
కరీంనగర్‌టౌన్: విద్యార్థి జీవితాన్ని కీలకమలుపు తిప్పేది పదోతరగతి. ఇక్కడవేసే అడుగు భవితకు బాటు వేస్తుంది. మరో 70 రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 14,196మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఫిబ్రవరి, మార్చి విద్యార్థులకు పరీక్షల కాలమే. ఏడాది పొడవునా పాఠ్యాంశాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు ఆఖరు పరీక్షలు కావడంతో సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడిని అధిగమించి, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు.
ఏడాది పొడవునా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు చివర్లో అనారోగ్యానికి గురై ఫలితాల సాధనలో వెనకబడిన సందర్భాలు అనేకం. ఈ సమయంలో విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తినే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. మాంసాహారానికి దూరంగా ఉంటూ సాత్విక ఆహారం తీసుకోవాలి. తద్వారా పోషకాలు లభించడంతో పాటు మానసికంగా ఉత్సాహం చేకూరుతుంది. పండ్లు,కూరగాయలు తినడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
పరీక్షలకు చక్కటి ప్రణాళిక రూపొందించుకోవాలి. మొదటి, రెండో పేపర్లకు మాదిరి ప్రశ్నాపత్రాలు తయారు చేసుకోవాలి. వాటికి సమాధానాలు రాయాలి. క్వశ్చన్ బ్యాంక్‌లోని చిన్న, పెద్ద ప్రశ్నలను చదవాలి. రోజు ఆరు పాఠ్యాంశాలు విధిగా చదవాలి. ఉదయం 4.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సమయపాలన రూపొందించుకోవాలి. ఏడాదికాలంలో చదివిందంతా రెండున్నర గంటల్లో రాయాల్సి ఉంటుంది. కాబట్టి అక్షర దోషాలు, కొట్టివేతలు లేకుండా అన్ని అక్షరాలు సమానంగా, తలకట్టు, గుడి ఒకేలా, గుడి దీర్ఘాలు పెద్దగా, చిన్నగా కాకుండా సరిపడేలా రాయాలి. జవాబులు అందంగా రాసేలా మెరుగు దిద్దుకోవాలి.
ఇష్టంగా చదివితే ఉత్తమ ఫలితాలు
‘పది’ సూత్రాలు పాటిస్తే ప్రయోజనాలు
ఆత్మవిశ్వాసంతో ఒత్తిడి మాయం
తల్లిదండ్రులు తోడ్పాటునందించాలి
ఆహారం ఎంతో కీలకం
చక్కటి ప్రణాళిక


