
యువజన సంఘాల ఊసేది
కథలాపూర్: నెహ్రూ యువ కేంద్రంలో వాలంటీర్ల వ్యవస్థ నిలిచిపోయింది. ఏడాదిన్నర నుంచి పోస్టులు భర్తీ చేయడంలేదు. దేశప్రగతిలో యువతను భాగస్వామ్యం చేసేందుకు కేంద్ర యువజన సర్వీ సుల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నెహ్రూ యువ కేంద్రం పేరును ఇటీవల ‘మేరా యువ భారత్’గా మార్చారు. యువజన సంఘాల ను పర్యవేక్షిస్తూ వారిలో చైతన్యం నింపేందుకు క్షేత్రస్థాయిలో వాలంటీర్ల వ్యవస్థ పని చేయాల్సి ఉంటుంది. ఏడాదిన్నరగా జిల్లాలో కొత్తగా యువజన సంఘాల స్థాపన ఊసేలేదు. సమాజంలోని రుగ్మతలను రూపుమాపేలా ప్రజా చైతన్య కార్యక్రమాలు స్తంభించిపోయాయని పేర్కొంటున్నారు.
ఎన్‌వైకే వాలంటీర్లుంటే
ప్రజా చైతన్య కార్యక్రమాలు
ప్రస్తుత పరిస్థితుల్లో గంజాయి, మత్తు పదార్ధాలు యువతపై చెడు ప్రభావం చూపుతోంది. యువతలో మార్పు తేవడానికి ఎన్‌వైకే వలంటీర్ల కార్యక్రమాలు ప్రభావం చూపుతాయి. వలంటీర్ల నియామకాల్లో 18 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఉన్నత విద్య, కంప్యూటర్ పరిజ్ఞానం, స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ తెలిసి ఉండి ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌లో పనిచేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు. గ్రామాల్లో సర్పంచుల, పట్టణాల్లో కౌన్సిలర్ల పాలన కొనసాగడంలేదు. ఇలాంటి సందర్భాల్లో యువ కేంద్రాల వలంటీర్లుంటే ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రయోజనముంటుందని అంటున్నారు. రక్తదాన శిబిరాలు, వన మహోత్సవం, స్వచ్ఛభారత్, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, మూఢనమ్మకాల నిర్మూలన, బాల్య వివాహాలు అరికట్టడం, క్రీడలు తదితర సామాజిక కార్యక్రమాలు యువజ న సంఘాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో వలంటీర్లు కీలకంగా వ్యవహరిస్తారు. వలంటీర్ వ్యవస్థ ఉద్యోగం కానప్పటికి సేవా భావంతో పని చేస్తుండటంతో గౌరవ వేతనం రూ.5 వేలు చెల్లిస్తారు.
కొత్త జిల్లాల వారీగా నియమిస్తే ప్రయోజనం
నెహ్రూ యువ కేంద్రం వలంటీర్ల నియామకం గురించి ఏడాదిన్నరగా పట్టించుకోవడంలేదని యువత అంటోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఎన్‌వైకేను కొనసాగిస్తుండటంతో జిల్లాకు కేవలం ముగ్గురు వలంటీర్లను మాత్రమే నియమించి అరకొరగా కార్యక్రమాలు నిర్వహించేవారు. జిల్లా ఏర్పడి తొమ్మిదేళ్లు అవుతోంది. ప్రస్తుతం 20 మండలాలున్నాయి. రోజురోజుకూ జనాభా పెరుగుతుండటంతో కొత్త జిల్లాల ప్రకారం ఎన్‌వైకే కార్యక్రమాలు నిర్వహిస్తే రెండు మండలాలను కలిపి ఒక బ్లాక్‌గా ఏర్పాటు చేసి సుమారు 10 మంది వలంటీర్లను నియమించే అవకాశం ఉంటుందని యువజన సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇలా అయితేనే లక్ష్యం నెరవేరుతుందంటున్నారు. యువజనశాఖ ఉన్నతాధికారులు చొరవ చూపి కొత్త జిల్లాల ప్రకారం ఎన్‌వైకే వలంటీర్లను నియమించి ప్రజాచైతన్య కార్యక్రమాలు కొనసాగించాలని యువత కోరుతోంది.
ఏడాదిన్నరగా నిలిచిన నెహ్రూ యువ కేంద్రం వలంటీర్ల నియామకం
కొత్త జిల్లా ప్రకారం వలంటీర్లను నియమించాలంటున్న యువత